పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూత..!

By Sumanth KanukulaFirst Published Feb 5, 2023, 11:44 AM IST
Highlights

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూశారు.

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూశారు. దుబాయ్‌లోని ఆస్పత్రిలో పర్వేజ్ ముషారఫ్ ఆదివారం తుదిశ్వాస విడిచారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముషారఫ్ దుబాయ్‌లోని అమెరికన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూసినట్టుగా పాకిస్తాన్‌కు చెందిన జియో న్యూస్ తెలిపింది.. ఇక, ముషారఫ్ 1943 ఆగస్టు 11న ఢిల్లీలో జన్మించారు. వారి కుటుంబం 1947లో న్యూఢిల్లీ నుంచి కరాచీకి తరలివెళ్లింది. ముషారఫ్ కరాచీలోని సెయింట్ పాట్రిక్స్ హైస్కూల్‌లో తన ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. లాహోర్‌లోని ఫోర్మాన్ క్రిస్టియన్ కాలేజీలో ఉన్నత విద్యను అభ్యసించారు.

ముషారఫ్ 1964లో పాకిస్థాన్ సైన్యంలో చేరారు. క్వెట్టాలోని ఆర్మీ స్టాఫ్ అండ్ కమాండ్ కాలేజీలో గ్రాడ్యుయేట్ అయ్యారు. 1998లో ఆయన జనరల్ స్థాయికి పదోన్నతి పొందారు. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. 1999లో నవాజ్ షరీఫ్ సర్కార్‌పై తిరుగుబాటు చేసి  అధికారాన్ని స్వాధీనం చేసుకున్నారు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ పదవిని చేపట్టారు. 2001 నుంచి 2008 వరకు పాకిస్తాన్ అధ్యక్షునిగా కొనసాగారు. అభిశంసనను తప్పించుకునేందుకు పదవికి రాజీనామా చేశారు. 

ఇక, పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) హయాంలో ముషారఫ్‌ గతంలో చేసిన చర్యలకు సంబంధించి దేశద్రోహం కేసు నమోదు చేయబడింది. 2016 మార్చి 31న తనపై  అభియోగాలపై అభియోగాలు మోపబడినప్పుడు ముషారఫ్ కోర్టుకు హాజరయ్యారు. ఆ తర్వాత దేశం విడిచి వెళ్లిపోయారు. ఇక, 2016 నుంచి ముషారఫ్ దుబాయ్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ఇక, ఈ దేశద్రోహం కేసుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 6 ప్రకారం డిసెంబర్ 17, 2019న ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించింది. ఆ తర్వాత అతని మరణశిక్ష రద్దు చేయబడింది. 

click me!