నేపాల్ ప్రధానిగా మాజీ మావోయిస్టు గెరిల్లా ప్రచండ.. రేపు ప్రమాణం

By Mahesh KFirst Published Dec 25, 2022, 7:59 PM IST
Highlights

నేపాల్ ప్రధానమంత్రిగా పుష్ప కమల్ దహల్ మూడో సారి బాధ్యతలు చేపట్టనున్నారు. నేపాల్ పీఎంగా ప్రచండను అధ్యక్షుడు బిద్యా దేవీ భండారి అపాయింట్ చేసింది. రేపు సాయంత్రం 4 గంటలకు ఆయన పీఎంగా ప్రమాణం చేయనున్నారు.
 

న్యూఢిల్లీ: నేపాల్ రాచరికానికి వ్యతిరేకంగా సుమారు దశాబ్ద కాలం తిరుగుబాటు చేసిన పుష్ప కమల్ దహల్ ప్రచండ ఆ దేశ ప్రధానమంత్రిగా నియామకం అయ్యారు. సుమారు పది సంవత్సరాలు ఆయన మావోయిస్టు గెరిల్లాగా పోరాడారు. నేపాల్ అధ్యక్షులు బిద్యా దేవీ భండారి.. సీపీఎన్ మావోయిస్టు సెంటర్ చైర్మన్ ప్రచండ (అజ్ఞాతంలో ఉన్నప్పటి పేరు)ను ప్రధానిగా అపాయింట్ చేశారు. రాజ్యాంగంలోని 76వ ఆర్టికల్ 2 క్లాజు ఆధారంగా ప్రచండను పీఎంగా నియమించారు. అధ్యక్షులు విధించిన డెడ్ లైన్ లోపలే అంటే ఆదివారం సాయంత్రం 5 గంటల్లోపే ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరారు. రేపు సాయంత్రం 4 గంటలకు ప్రధానమంత్రిగా 68 ఏళ్ల ప్రచండ ప్రమాణం తీసుకుంటారు. ప్రచండ ఇది వరకే రెండు సార్లు నేపాల్ ప్రధానిగా చేశారు.

నేపాల్‌లో గత నెల ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ఫలితాల్లో హంగ్ వచ్చింది.  దీంతో ప్రచండ పార్టీ సీపీఎన్ మావోయిస్టు సెంటర్ ప్రధాన ప్రతిపక్షంతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నది. ప్రధానమంత్రి పదవిని వారు పంచుకుంటున్నారు. తొలి రెండున్నరేళ్లు ప్రచండ పీఎంగా ఉంటే.. మిగిలిన కాలం కమ్యూనిస్టు యునిఫైడ్ మార్క్సిస్టు లెనినిస్టు పార్టీ నేత ప్రధానిగా బాధ్యతలు తీసుకుంటారు. 2025లో ప్రచండ ప్రధానిగా దిగిపోతారు.

ఇది ఈ రెండు పక్షాల మధ్య కుదిరిన ఒప్పందం అని మావోయిస్టు సెంటర్ పార్టీ జనరల్ సెక్రెటరీ దేవ్ గురుంగ్ తెలిపారు. మిగతా పోస్టులు, మంత్రిత్వ శాఖల కేటాయింపులపై కసరత్తు జరగాల్సి ఉన్నదని వివరించారు. 

Also Read: 16 భారత ఫార్మా కంపెనీల నుంచి ఔషధాల దిగుమతిపై నేపాల్ నిషేధం

ప్రధానమంత్రి షేర్ బహదూర్ ద్యూబా ప్రభుత్వ కూటమి నుంచి ప్రచండ అందరినీ ఆశ్చర్యపరుస్తూ పక్కకు జరిగాయి. మద్దతు ఉపసంహరించుకున్నారు. ప్రధానమంత్రి పదవికి ప్రచండకు ద్యూబా పక్షం మద్దతు ఇవ్వడానికి నిరాకరించింది.

275 సీట్లు గల ప్రతినిధుల సభలో మావోయిస్టు సెంటర్ పార్టీ 32 స్థానాలు గెలుచుకుంది. యూఎంఎల్ 78 స్థానాలు గెలుచుకుంది. ప్రచండకు సీపీఎన్ యూఎంఎల్, సీపీఎన్ ఎంసీ, ఆర్ఎస్‌పీ, ఆర్‌పీపీ, జేఎస్‌పీ, జనామత్, నాగరిక్ ఉన్ముక్తి పార్టీల మద్దతు ఉన్నది. మొత్తం 165 చట్ట సభ్యులు ప్రచండకు మద్దతు ఇస్తున్నారు.

నేపాల్‌లో రాచరికం కూలిపోయాక 2008 నుంచి ఇప్పటి వరకు పది ప్రభుత్వాలు మారాయి.

కాస్కి జిల్లా దికుర్పొఖారిలో 1954 డిసెంబర్ 11న జన్మించిన ప్రచం 13 ఏళ్లపాటు అండర్‌గ్రౌండ్‌లో ఉన్నారు. సీపీఎన్ మావోయిస్టు శాంతియుత రాజకీయాలను ఎంచుకున్న తర్వాత ఆయన ప్రధానస్రవంతి రాజకీయాల్లోకి వచ్చారు.

click me!