అప్పుడు అఫ్ఘాన్ మంత్రి.. ఇప్పుడు జర్మనీలో పిజ్జా డెలివరీ బాయ్

By telugu teamFirst Published Aug 25, 2021, 6:10 PM IST
Highlights

ఆఫ్ఘనిస్తాన్ ఐటీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సయ్యద్ అహ్మద్ షా సాదత్ ఇప్పుడు జర్మనీ వీధుల్లో పిజ్జా డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఏడాది క్రితం మంత్రి పదవికి రాజీనామా చేసి కుటుంబ సమేతంగా జర్మీనీ చేరుకున్న ఆయన ఉద్యోగాలేవీ రాకపోవడంతో డెలివరీ బాయ్‌గా చేయకతప్పలేదని వివరించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రస్తుత పరిణామాలను తాను ఊహించలేదని అన్నారు.
 

న్యూఢిల్లీ: ఒకప్పుడు ఆయన ఆఫ్ఘనిస్తాన్ ఐటీ మంత్రి, ఇప్పుడు జర్మనీలో పిజ్జా డెలివరీ బాయ్‌గా జీవితాన్ని సాగిస్తున్నాడు. జర్మనీలోని లీప్‌జిగ్ పట్టణ వీధుల్లో ఆరెంజ్ కలర్ డ్రెస్సులో సైకిల్‌పై డోర్ టు డోర్ డెలివరీ చేస్తున్నాడు. స్థానిక జర్నలిస్టు ఒకరు ఆఫ్ఘనిస్తాన్ మాజీ మంత్రి సయ్యద్ అహ్మద్ షా సాదత్ ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఈ విషయం వైరల్ అయింది. సాదత్ స్వయంగా ఆ ఫొటో తనదేనని ధ్రువీకరించారు.

ఆఫ్ఘనిస్తాన్‌లో అష్రఫ్ ఘనీ ప్రభుత్వంలో 2018లో సమాచార మంత్రిగా సాదత్ బాధ్యతలు చేపట్టారు. రెండేళ్లు మంత్రిగా సేవలందించారు. అష్రఫ్ ఘనీతో పొరపొచ్చాలు వచ్చాయని, అదే కారణంతో సాదత్ 2020లో రాజీనామా చేసినట్టు తెలిసింది. అదే సంవత్సరం ఆయన ఆఫ్ఘనిస్తాన్ వదిలి జర్మనీ ప్రయాణమయ్యాడు. జర్మనీలో చాలా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేశాడు. కానీ, ఉద్యోగాలేవీ వరించకపోవడంతో డెలివరీ బాయ్ అవతారమెత్తాడు.

‘ఇప్పుడు నేను సాధారణ జీవితం గడుపుతున్నాను. జర్మనీలో సురక్షితంగా ఉన్నట్టు ఫీల్ అవుతున్నాను. నా కుటుంబ సమేతంగా లీప్‌పిగ్‌లో నివసిస్తుండటంపై సంతోషంగా ఉన్నాను. నేను కొంత డబ్బును పొదుపు చేయాలనుకుంటున్నాను. తద్వారా ఓ జర్మన్ కోర్స్ చేయాలనుకుంటున్నా. ఇంకా చదవాలనుకుంటున్నాను’ అని సాదత్ అన్నారు.

‘నేను ఇక్కడ చాలా కంపెనీల్లో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాను. కానీ, ఎలాంటి స్పందనలు రాలేదు. జర్మన్ టెలికాం కంపెనీలో పనిచేయాలనేది నా కల’ అని వివరించారు. సాదత్‌కు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి రెండు మాస్టర్స్ డిగ్రీలున్నాయి. ఒకటి ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్, మరొకటి కమ్యూనికేషన్‌లో పట్టా ఉన్నది. అంతేకాదు, సుమారు 13 దేశాల్లో కమ్యూనికేషన్ సంబంధిత 20 రంగాల్లో పనిచేసిన అనుభవమున్నది. కమ్యూనికేషన్‌ రంగంలో 23ఏళ్లకు మించిన ఎక్స్‌పీరియన్స్ ఉన్నది.

ఆఫ్ఘనిస్తాన్‌లో చోటుచేసుకున్న ప్రస్తుత పరిణామాలపైనా ఆయన స్పందించారు. తాలిబాన్లు దేశాన్ని ఆక్రమించుకోవడంపై అభిప్రాయాన్ని అడగ్గా ‘అష్రఫ్ ప్రభుత్వం ఇంత తొందరగా కూలిపోతుందని కోలేదు. ఈ పరిణామాన్ని ఊహించనేలేదు’ అని తెలిపారు.

click me!