ఫిలిప్పీన్స్‌లో వ‌ద‌రల‌ బీభ‌త్సం.. 32 మంది మృతి, నిరాశ్ర‌యులైన ల‌క్ష‌లాది మంది

By Mahesh RajamoniFirst Published Dec 29, 2022, 5:11 PM IST
Highlights

Manila: ఫిలిప్పీన్స్ ను భారీ వ‌ర‌ద‌లు ముంచెత్తాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్ప‌టివ‌ర‌కు మరణించిన వారి సంఖ్య 32కు చేరుకుందని ప్రభుత్వ గణాంకాలు పేర్కొంటున్నాయి. ల‌క్ష‌లాది మంది నిరాశ్ర‌యుల‌య్యారు. 
 

Philippines Floods: ఫిలిప్పీన్స్ ను భారీ వ‌ర‌ద‌లు ముంచెత్తాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్ప‌టివ‌ర‌కు మరణించిన వారి సంఖ్య 32కు చేరుకుందని ప్రభుత్వ గణాంకాలు పేర్కొంటున్నాయి. ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్థితుల క్ర‌మంలో మ‌ర‌ణాలు మ‌రింత‌గా పెరిగే అవ‌కాశ‌ముంది. వివ‌రాల్లోకెళ్తే.. ఫిలిప్పీన్స్  విడుదల చేసిన ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఫిలిప్పీన్స్‌లో భారీ వర్షాలు వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 32 కి చేరుకుంది. ల‌క్ష‌లాది మంది నిరాశ్ర‌యుల‌య్యారు. నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్ కౌన్సిల్ ప్ర‌కారం.. దక్షిణ ఫిలిప్పీన్స్‌లో 23 మంది, ప్రధాన లుజోన్ ద్వీపంలోని బికోల్ ప్రాంతంలో ఆరుగురు, సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లో ముగ్గురు మరణించినట్లు జిన్హువా వార్తా సంస్థ నివేదించింది. 

ఇంకా 24 మంది గల్లంతయ్యారనీ, మరో 11 మంది గాయపడ్డారని ఏజెన్సీ తెలిపింది. అల్పపీడన ప‌రిస్థితులు త‌గ్గిపోయిన‌ప్ప‌టికీ.. దేశంలోని కొన్ని ప్రాంతాలలో, ముఖ్యంగా మధ్య-దక్షిణ ఫిలిప్పీన్స్‌లో ఇంకా వర్షం కురుస్తూనే ఉంద‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. అలాగే, చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో మృతుల సంఖ్య పెరిగింద‌ని స‌మాచారం. "వరదలు-వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడే అవకాశం ఉంది" అని నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్ కౌన్సిల్ బ్యూరో హెచ్చరించింది. వరదలు దేశవ్యాప్తంగా 10 ప్రాంతాలలో 486,000 మంది ప్రజలను ప్రభావితం చేశాయి. ఇళ్ళు, పంటలు, రోడ్లు,  వంతెనలు దెబ్బతిన్నాయి. నిర్వాసితులైన కొందరు ఇప్పటికీ తాత్కాలిక ప్రభుత్వ ఆశ్రయాల్లోనే ఉన్నారు.

Latest Videos

ప్రధానంగా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్, పసిఫిక్ టైఫూన్ బెల్ట్‌లో దాని స్థానం కారణంగా ఫిలిప్పీన్స్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత విపత్తు-పీడిత దేశాలలో ఒకటిగా ఉంది. సగటున, దేశం సంవత్సరానికి 20 టైఫూన్‌లను ఎదుర్కొంటుంది. వాటిలో కొన్ని తీవ్రమైనవిగా ఉండ‌గా, మ‌రికొన్ని తీవ్ర‌మైన విధ్వంసాన్ని సృష్టించేవిగా ఉంటాయి. వరదల బారిన పడిన కొన్ని ప్రాంతాల్లో రానున్న 24 గంటల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల కార‌ణంగా రోడ్లు, వంతెన‌లు దెబ్బ‌తిన్నాయి. దీంతో పాటు వరదల కారణంగా వేల సంఖ్య‌లో ఇళ్ళు దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది. తాగ‌డానికి నీరు, తిన‌డానికి ఆహారం లేని ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్న‌వారు పెద్ద సంఖ్య‌లో ఉన్నార‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. 

click me!