120కి పైగా క్షిపణులతో భారీ అటాక్.. ఉక్రెయిన్‌పై మరోసారి విరుచుకుపడిన రష్యా.. !

By Sumanth KanukulaFirst Published Dec 29, 2022, 3:23 PM IST
Highlights

రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్దం కొనసాగుతుంది. తాజాగా ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణులతో విరుచుకుపడంది. ప్రధాన నగరాలను లక్ష్యంగా చేసుకుని 120 కంటే ఎక్కువ క్షిపణులను ప్రయోగించింది.

రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్దం కొనసాగుతుంది. తాజాగా ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణులతో విరుచుకుపడంది. ప్రధాన నగరాలను లక్ష్యంగా చేసుకుని 120 కంటే ఎక్కువ క్షిపణులను రష్యా ప్రయోగించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ సలహాదారు మైఖైలో పోడోల్యాక్ చెప్పారు. క్లిష్టమైన మౌలిక సదుపాయాలను నాశనం చేయడానికి, పౌరులను సామూహికంగా చంపడానికి రష్యా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇక, ఉక్రెయిన్ రాజధాని కీవ్, తూర్పున ఉన్న ఖార్కివ్, పోలాండ్ సరిహద్దులోని పశ్చిమ నగరం ఎల్వివ్‌తో సహా దేశమంతటా దాడులు చోటుచేసుకున్నట్టుగా నివేదికలు సూచిస్తున్నాయి.

రాజధాని కీవ్‌లో‌ సంభవించిన పేలుళ్ల కారణంగా కనీసం ముగ్గురు గాయపడటంతో వారిని ఆస్పత్రికి తరలించినట్టుగా మేయర్ విటాలి క్లిట్ష్కో తెలిపారు. వారిలో ఒక 14 ఏళ్ల బాలిక కూడా ఉన్నట్టుగా చెప్పారు. నగరంలో విద్యుత్ కోతలు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించిన ఆయన.. ప్రజలు నీటిని నిల్వ చేసుకోవాలని కోరారు. 

రాజధాని కీవ్ తూర్పున క్షిపణుల నుండి వచ్చిన శిధిలాల వల్ల రెండు గృహాలు దెబ్బతిన్నాయని, నైరుతి ప్రాంతంలో ఒక పారిశ్రామిక సంస్థ, ఆట స్థలం దెబ్బతిన్నాయని నగర అధికారులు తెలిపారు. ఇక, ఇటీవలి వారాల్లో భారీగా రష్యా దాడుల వల్ల.. ఉక్రెయిన్ దేశవ్యాప్తంగా పదేపదే విద్యుత్ కోతలు ఏర్పడుతున్నాయి. ఎల్వివ్ మేయర్ గురువారం మాట్లాడుతూ, తన నగరంలో 90 శాతం విద్యుత్తు లేకుండా ఉందని చెప్పారు. 

రష్యా వాయు, సముద్ర ఆధారిత క్రూయిజ్ క్షిపణులతో వివిధ దిశల నుండి తమ దేశంపై దాడి చేస్తోందని ఉక్రెయిన్ వైమానిక దళం పేర్కొంది. అనేక కమికేజ్ డ్రోన్‌లను కూడా ఉపయోగించినట్లు ఆరోపించింది. ఈ దాడిని ‘‘భారీ దాడి’’గా పేర్కొంది.  ఇక, గురువారం ఉదయం దేశంలోని అన్ని ప్రాంతాల్లో వైమానిక దాడుల గురించి హెచ్చరికలు వినిపించాయి. 
 

click me!