బలూచిస్థాన్‌లో పేలుళ్లు.. ఐదుగురు పాకిస్థాన్ సైనికుల మృతి.. పలువురికి గాయాలు 

By Rajesh KarampooriFirst Published Dec 26, 2022, 3:33 AM IST
Highlights

బలూచిస్థాన్‌లో జరిగిన పలు పేలుళ్లలో ఐదుగురు పాకిస్తాన్ సైనికులు మృతి చెందినట్లు సమాచారం. ఈ దాడిలో పది మంది గాయపడినట్లు కూడా సమాచారం. మరోవైపు అమెరికా ఎంబసీ తన ప్రభుత్వ ఉద్యోగులకు భద్రతా హెచ్చరికలు జారీ చేసింది.

పాకిస్థాన్ ఆర్మీపై ఉగ్రవాదులు నిరంతరం దాడులు చేస్తున్నారు. తాజాగా మరోసారి పాకిస్తానీ సైన్యంపై దాడి జరిగింది. ఈ దాడిలో  కమాండర్‌తో సహా ఐదుగురు పాకిస్తాన్ సైనికులు మరణించారు. ఈ సంఘటన బలూచిస్థాన్ లో చోటుచేసుకుంది. బలూచిస్థాన్ పోస్ట్ ప్రకారం.. ఈ దాడిలో మరణించిన కమాండర్ పేరు కెప్టెన్ ఫహద్. మరణించిన వారిలో సిపాయిలు అస్రాగ్, షామూమ్, మెహ్రాన్, లాన్స్ నాయక్ ఇంతియాజ్ ఉన్నారు. ఈ దాడిలో మరో ఆరుగురు పాక్‌ సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడికి బాధ్యులమని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది.
 
ఇది కాకుండా, అప్రసిద్ధ ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) గత రెండు రోజుల్లో బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో పలుమార్లు దాడులు నిర్వహించింది. ఇందులో ఆరుగురు భద్రతా సిబ్బంది మరణించారు . పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పాకిస్థాన్ ఆర్మీ మీడియా విభాగం ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించింది. పాకిస్తాన్ ఆర్మీ మీడియా విభాగం ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. జోబ్ జిల్లాలోని సంబాజా ప్రాంతంలో నిర్వహించిన ఇంటెలిజెన్స్ ఆపరేషన్‌లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది, ఒక సైనికుడు మరణించారు. .

విశ్వసనీయ సమాచారం ఆధారంగానే ఈ ఆపరేషన్‌ ప్రారంభించామని, గత 96 గంటలుగా ఈ ఆపరేషన్‌ కొనసాగుతోందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ISPR ప్రకటన ప్రకారం.. ఈ ఆపరేషన్ "పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల గుండా ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోకి చొరబడకుండా.. పౌరులు మరియు భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకోవడానికి కొన్ని అనుమానిత మార్గాలను ఉపయోగించకుండా నిరోధించడం" లక్ష్యంగా పెట్టుకుంది.

సైనిక వాహనంపై దాడి.. నలుగురు బలి

మరో సంఘటనలో.. శనివారం టర్బోట్‌లోని దనుక్ గోగ్దాన్ ప్రాంతంలో ఫ్రాంటియర్ కార్ప్స్ వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు సైనికులను చంపారు. సరిహద్దు పట్టణంలోని చమన్‌లోని చెక్‌పోస్టు వద్ద గుర్తుతెలియని ద్విచక్రవాహనంపై వచ్చిన దుండగులు శనివారం  అర్థరాత్రి కాల్పులు జరిపి లెవీ (ప్రావిన్షియల్ పారామిలటరీ దళం) జవాన్‌ను హతమార్చారు. టర్బత్, చమన్‌లో జరిగిన దాడులకు టీటీపీ బాధ్యత వహించింది.

ఈ ఘటనను ఖండిస్తూ బలూచిస్థాన్ ముఖ్యమంత్రి అబ్దుల్ ఖుదుస్ బిజెంజో మాట్లాడుతూ నగరంలో భద్రతను మరింత పటిష్టం చేయాలని పోలీసు చీఫ్‌ను కోరినట్లు తెలిపారు. గత కొన్ని వారాలుగా పాకిస్థాన్‌లో పలు ఉగ్రదాడులు జరిగాయి. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని బన్నూ నగరంలోని ఉగ్రవాద నిరోధక శాఖ ప్రాంగణాన్ని తెహ్రిక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) ఇటీవల స్వాధీనం చేసుకుందని తెలిపారు.

భద్రతా హెచ్చరికలను జారీ చేసిన US ఎంబసీ 

మరోవైపు ఇస్లామాబాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం తమ ప్రభుత్వ ఉద్యోగులకు భద్రతా హెచ్చరికలు జారీ చేసింది. మారియట్ హోటల్‌లోకి ఉద్యోగులను రానీయకుండా నిషేధించారు. ఇస్లామాబాద్‌లోని మారియట్ హోటల్‌లో సెలవులో ఉన్న అమెరికన్లపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసేందుకు కుట్ర పన్నుతున్నట్లు అమెరికా ప్రభుత్వానికి తెలుసునని రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఇస్లామాబాద్‌కు అనవసరమైన,అనధికారిక ప్రయాణాలను మానుకోవాలని ఎంబసీ ప్రభుత్వ ఉద్యోగులను కూడా కోరింది.

click me!