యుద్ధాలకు కూడా కొన్ని రూల్స్ ఉంటాయి - గాజాలో ఇజ్రాయెల్ తరలింపు ఆదేశాలపై యూఎన్ వో చీఫ్ ఫైర్..

By Asianet News  |  First Published Oct 14, 2023, 12:11 PM IST

యుద్ధాలకు కూడా కొన్ని రూల్స్ ఉంటాయని యూఎన్ వో చీఫ్ ఆంటోనియో గుటెరస్ అన్నారు. ఉత్తర గాజాలో ఉంటున్న 1.1 మిలియన్ల మంది పాలస్తీనియన్లు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ ఆదేశాలు జారీ చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఉత్తర గాజాలో ఉంటున్న 1.1 మిలియన్ల మంది పాలస్తీనియన్లు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ అల్టిమేటం జారీ చేసింది. అయితే దీనిపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ అల్టిమేటంను అత్యంత ప్రమాకరమైనదిగా శుక్రవారం అభివర్ణించారు. దానిని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. యుద్ధాలకు కూడా కొన్ని నింబంధనలు ఉంటాయని అన్నారు. 

గుటెరస్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మొత్తం భూభాగం ముట్టడిలో ఉన్నప్పుడు, జనసాంద్రత కలిగిన యుద్ధ ప్రాంతం గుండా ఒక మిలియన్ కంటే ఎక్కువ మందిని ఆహారం, నీరు, వసతి లేని ప్రదేశానికి తరలించడం చాలా ప్రమాదకరం. ఇది కొన్ని సందర్భాల్లో అసాధ్యం’’ అని అన్నారు. గాజాలో మానవతా పరిస్థితిని ప్రస్తావిస్తూ.. ఇజ్రాయెల్ వైమానిక దాడుల తరువాత ఆసుపత్రులు ఇప్పటికే గరిష్ట సామర్థ్యంతో పనిచేస్తున్నాయని, దీని వల్ల మొత్తం ఆరోగ్య వ్యవస్థ కూలిపోయే అంచుల్లో ఉందని యూఎన్ వో చీఫ్ అన్నారు.

Latest Videos

undefined

ఆరోగ్య కేంద్రాలపై జరిగిన 24 దాడుల్లో విధి నిర్వహణలో ఉన్న 11 మంది సిబ్బంది మరణించారని తెలిపారు. దెబ్బతిన్న మౌలిక సదుపాయాల కారణంగా మొత్తం గాజాన్ భూభాగం నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని చెప్పారు. విద్యుత్తు లేకుండా పనిచేస్తోందని అన్నారు. అంతర్జాతీయ మానవతా చట్టాన్ని, మానవ హక్కుల చట్టాన్ని గౌరవించాలని ఆయన కోరారు. పౌరులను రక్షించాలని, వారిని ఎప్పటికీ కవచాలుగా ఉపయోగించకూడదని అన్నారు. గాజాలోని బందీలందరినీ వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

అలాగే ఇజ్రాయెల్ అల్టిమేటం గాజా పౌరులపై ఉక్కుపాదం మోపడమేనని ఐక్యరాజ్యసమితి అండర్ సెక్రటరీ జనరల్ ఫర్ హ్యుమానిటేరియన్ అఫైర్స్ అండ్ ఎమర్జెన్సీ రిలీఫ్ కోఆర్డినేటర్ మార్టిన్ గ్రిఫిత్స్ అభివర్ణించారు. ‘‘జనసాంద్రత ఎక్కువగా ఉన్న వార్ జోన్ ను 24 గంటల్లో 1.1 మిలియన్ల మంది ఎలా తరలిస్తారు? తరలింపు ఉత్తర్వు వల్ల మానవీయ పరిణామాలు ఎలా ఉంటాయో తలుచుకుంటే వణికిపోతున్నారు’’ అని అన్నారు. వినాశకరమైన మానవతా పరిణామాలు లేకుండా ఇలాంటి ఉద్యమం జరగడం అసాధ్యమని ఐక్యరాజ్యసమితి భావిస్తోందని గుటెరస్ అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ అన్నారు. అలాంటి ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని తాము గట్టిగా విజ్ఞప్తి చేస్తున్నామని ఆయన శుక్రవారం చెప్పారు.

హమాస్ మిలిటింట్ ను ఏరివేసేందుకు ఇజ్రాయెల్ సైన్యం 1.1 మిలియన్ల జనాభా కోసం తరలింపు ఉత్తర్వులను జారీ చేసింది. పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, క్లినిక్ లతో సహా ఐక్యరాజ్యసమితి సిబ్బంది, ఐరాస సౌకర్యాలలో ఆశ్రయం పొందిన వారందరికీ ఈ ఉత్తర్వు వర్తిస్తుంది. అయితే దీని వల్ల మరిన్ని మరణాలు సంభవించే అవకాశం ఉంది.

యుద్ధంతో అతలాకుతలమైన గాజా నగరం నుంచి బయటకు పరుగులు తీయడానికి ప్రయత్నిస్తున్న ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో దాదాపు 70 మంది మరణించారని హమాస్ అధికారులు తెలిపారు. గాజా సిటీ నుంచి దక్షిణం వైపు వెళ్తుండగా మూడు చోట్ల కార్లు దాడి చేసినట్లు హమాస్ మీడియా కార్యాలయం తెలిపింది. వైమానిక దాడుల లక్ష్యం ఎవరు, ప్రయాణికుల్లో మిలిటెంట్లు ఉన్నారా అనేది తెలియరాలేదు. 

click me!