
న్యూఢిల్లీ: గత నెల 24న ఉక్రెయిన్ (Ukraine)పై రష్యా (Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) ‘మిలిటరీ ఆపరేషన్’ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ యుద్ధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. ఉక్రెయిన్‌లో ఒక్కో నగరాన్ని టార్గెట్ చేస్తూ రష్యా సేనలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. కాగా, రష్యా సైన్యాన్ని ఎదుర్కోవడానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ (Volodymyr Zelenskyy) ఎన్నో విధాల ప్రయత్నించి పౌరులనూ యుద్ధోన్ముఖులు చేశారు. భయానక పరిస్థితులు ఎదురవుతున్నా సాహసవంతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. రష్యా ఒకవైపు యుద్ధం చేస్తుంటే వెంటనే యూరోపియన్ యూనియన్‌లో సభ్యత్వం కావాలని తీసుకున్నారు. నాటోలో చేరుతున్నారనే కోపంతో రష్యా దాడి చేస్తుండగా.. ఆ దాడిని నిలువరించే చర్యలు తీసుకోలేదని ఆయన ఏకంగా నాటోనూ ఏకిపారేశారు. ఇలాంటి సందర్భంలో ఆయన ప్రాణాలకు ముప్పు ఉంటుందని సులువుగానే ఊహించుకోవచ్చు. అప్పటికే ఆయన దేశం వదిలి పారిపోయారనే పుకార్లూ వచ్చాయి. అవి కేవలం వదంతులేనని, తాను ఇంకా ఉక్రెయిన్‌లోనే ఉన్నారని ఓ వీడియో పోస్టు చేశారు.
రష్యా యుద్ధంతో ముప్పు ఉన్నదని జెలెన్‌స్కీని దేశం వదిలిరమ్మని, తరలించడానికి తాము సిద్ధం అని అమెరికా ప్రకటించింది. కానీ, ఆ సహాయాన్నీ ఆయన తోసిపుచ్చారు. తనకు కావాల్సింది తరలింపు కాదని, ఆయుధాలు పంపండి ఈ రణభూమిలో తాడో పేడో తేల్చుకుంటాం అన్నట్టుగా సమాధానం ఇచ్చారు. ఈ ధైర్య సాహసాలు రష్యా వంటి పెద్ద దేశం ముందు నిలబడి ప్రదర్శిస్తుండటం ఆశ్చర్యకరంగా ఉన్నది.
ఇప్పటికే ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీని చంపాలని మూడు సార్లు హత్యా ప్రయత్నాలూ జరిగినట్టు వార్తలు వచ్చాయి. కానీ, చివరి నిమిషంలో అందిన సమాచారంతో భద్రతా సిబ్బంది జెలెన్‌స్కీని కాపాడగలిగారు. చెచెన్ రెబెల్స్, వాగ్నర్ గ్రూపులు జెలెన్‌స్కీని అంతమొందించాలనే లక్ష్యంతో రష్యా సూచనల మేరకు బయల్దేరినట్టు ఆరోపణలు వచ్చాయి.
తాజాగా, అమెరికా సెక్రెటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ జెలెన్‌స్కీ గురించి స్పందించారు. ఆయన మరణం గురించీ కీలక వ్యాఖ్యలు చేశారు. జెలెన్‌స్కీని ఒక వేళ రష్యా చంపేసినా.. ఉక్రెయిన్ ప్రభుత్వం కొనసాగడానికి సర్వం సిద్ధంగా ఉన్నదని వివరించారు. తాను మొన్న ఉక్రెయిన్ వెళ్లారని, అక్కడ ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రీ కులేబాతో సమావేశం అయినట్టు తెలిపారు. అయితే, దాని గురించి మాట్లాడుతూ, ఒక వేళ జెలెన్‌స్కీ మరణించినా ప్రభుత్వం నడవడానికి అన్ని రకాల ప్రణాళికలు ఉక్రెయిన్‌లో సిద్ధంగా ఉన్నట్టు ఆయన చెప్పారని వివరించారు. అదే సమయంలో రష్యాను ఎదుర్కోవడంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ, ఆయన ప్రభుత్వం చూపిస్తున్న తెగువ అమోఘం అని ప్రశంసించారు.