
న్యూఢిల్లీ: ప్రస్తుత తూర్పు ఐరోపాలో కొనసాగుతున్న ఉక్రెయిన్, రష్యా సంక్షోభంపై చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ రెండు పక్షాల మధ్య మధ్యవర్తిత్వం నెరపడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. రష్యాతో తమ స్నేహం ఎప్పటికీ చెరిగిపోదని, తమ ఫ్రెండ్‌షిప్ రాక్ సాలిడ్ అని పేర్కొంది. అవసరం అయితే.. అంతర్జాతీయ సమాజం కోరితే.. మధ్యవర్తిత్వానికి తాము సిద్ధం అని వివరించింది.
ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయగానే.. చైనాపై పరోక్షంగా ఒత్తిడి పడింది. ఉక్రెయిన్‌పై యుద్ధం చేయడంపై రష్యాను ప్రపంచ దేశాలు దాదాపు అన్నీ ఖండించాయి. చైనా ఒక మేజర్ ఎకానమీ. ఈ దేశం రష్యాను ఖండించకపోవడం చర్చనీయాంశం అయింది. ఈ సంక్షోభం మొదలైనప్పటి నుంచీ చైనా దౌత్యమార్గాల్లో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. అయినప్పటికీ దాని మిత్రదేశం రష్యాను ఖండించడానికి సిద్ధపడలేదు. ఇంతటి ఒత్తిడిలోనూ గత నెలలో రష్యా, చైనాల మధ్య అంతులేని వ్యూహాత్మక భాగస్వామ్యాలు ఉన్నాయని చైనా వెల్లడించింది.
ఇటీవలే యూరోపియన్ యూనియన్ ఫారీన్ పాలసీ చీఫ్ జెసెప్ బొర్రెల్ గతవారం మాట్లాడుతూ, రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య సంధి కుదిర్చే పాత్రను పశ్చిమ దేశాలు పూర్తి చేయలేవని వివరించారు. కాబట్టి, ఆ పాత్రను చైనా పోషించాలని కోరారు. శాంతి చర్చల్లో చైనా నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందని ఇది వరకు పలుసార్లు డ్రాగన్ కంట్రీ పేర్కొన్న సంగతి తెలిసిందే. అంతేకాదు, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ అంశంపై మాట్లాడుతూ, తాము ఉక్రెయిన్‌లో మానవ సంక్షోభంలో చిక్కుకున్న వారికి సహాయం అందిస్తామని తెలిపింది. ప్రపంచంలోనే అతి కీలకమైన ద్వైపాక్షిక సంబంధాలు రష్యా, చైనాల మధ్య ఉన్నాయని, ఈ సంబంధాలు ప్రపంచ మేలు, శాంతి స్థాపన, సుస్థిరత లక్ష్యంగా ఉన్నాయని వివరించింది.
ఇదిలా ఉండగా Ukraineపై కొనసాగుతున్న దాడికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ "స్పెషల్ మిలిటరీ ఆపరేషన్" అనే పదాన్ని ఉపయోగించడాన్ని Pope Francis ఆదివారం (మార్చి 6, 2022) అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాదు యుద్ధాన్ని వెంటనే ఆపాలని కోరారు. అది ఉన్మాదం అని చెప్పుకొచ్చారు.
Vatican Cityలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో గుమిగూడిన జనసమూహాన్ని ఉద్దేశించి తన వీక్లీ ప్రసంగంలో పోప్ మాట్లాడుతూ, ఇది కేవలం సైనిక చర్య కాదని, "మరణం, విధ్వంసం.. దుఃఖాలను నాటే యుద్ధం" అని అన్నారు. ఉక్రెయిన్‌లో రక్తపుటేరులు, కన్నీటి నదులు ప్రవహిస్తున్నాయి. ఇది కేవలం సైనిక చర్య మాత్రమే కాదు, మృత్యువు, విధ్వంసం.. దుఃఖానికి బీజం వేసే యుద్ధం’ అని ఆయన అన్నారు. "ఆ అమరవీరుల దేశంలో మానవతా సహాయం అవసరం గంట గంటకు పెరుగుతోంది" అని పోప్ అన్నారు. "యుద్ధం అంటే పిచ్చి! దయచేసి ఆపండి! ఆ క్రూరత్వాన్ని మానేయండి" అన్నారాయన. "Holy See శాంతిని పునరుద్ధరించడంలో ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుంది’ అని పోప్ అన్నారు. సహాయార్థుల కోసం ఇద్దరు రోమన్ కాథలిక్ కార్డినల్స్ ఉక్రెయిన్‌కు వెళ్లారని చెప్పారు. ప్రమాదం.. ప్రాణాలకు అపాయం అని తెలిసీ.. ప్రాణాలకు తెగించి యుద్ధాన్ని కవర్ చేస్తున్న విలేకరులకు, అక్కడి ప్రజల మీద జరుగుతున్న కృరత్వం, హింసలను వెలుగులోకి తెస్తున్న వారి ధైర్యాన్ని మెచ్చుకున్నారు.