శ్రీలంక బాటలో బంగ్లాదేశ్.. ఇంధన ధరలు 52 శాతం పెంపు.. దేశవ్యాప్తంగా ఆందోళనలు

Published : Aug 08, 2022, 12:24 PM IST
శ్రీలంక బాటలో బంగ్లాదేశ్.. ఇంధన ధరలు 52 శాతం పెంపు.. దేశవ్యాప్తంగా ఆందోళనలు

సారాంశం

శ్రీలంక బాటలోనే బంగ్లాదేశ్ ప్రయాణిస్తున్నది. బంగ్లాదేశ్‌లో చమురు ధరలను ప్రభుత్వం శుక్రవారం సుమారు 52 శాతం మేర పెంచింది. దీంతో ప్రజలు రోడ్డెక్కారు. భారీ ఆందోళనలు చేస్తున్నారు. వెంటనే ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.  

న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక ఇంకా కోలుకోనేలేదు. ఇంతలోపే భారత దేశ మరో పొరుగు దేశంలోనూ ఇవే ఛాయలు కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్‌ ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్ర ఒత్తిడి లోనవుతున్నట్టు విషదమవుతున్నది. 416 బిలియన్ డాలర్ల ఎకానమీ గల బంగ్లాదేశ్ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో ఉన్నది. కానీ, అంతర్జాతీయంగా చమురు ధరలు, ఆహార ధాన్యాల ధరలు పతనం కావడంతో ఈ దేశ దిగుమతి బిల్లులు తడిసి మోపెడయ్యయి. దీంతో వాణిజ్య లోటు ఏర్పడింది. వాటిని కప్పిపుచ్చడానికి అంతర్జాతీయ విత్త సంస్థల నుంచి రుణాలు తీసుకుంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచీ రుణాలు తీసుకుంది. కానీ, ఇప్పుడు బంగ్లాదేశ్‌కు చమురు ధరల పెంపు తప్పా మరో అవకాశం లేకుండా పోయిందని ఆ దేశ పవర్, ఎనర్జీ మినిస్టర్ నస్రుల్ హమీద్ తెలిపారు.

షేక్ హసీనా ప్రభుత్వం లీటర్ డీజిల్‌పై 34 టాకాలు, ఆక్టేన్ పై 46 టాకాలు, పెట్రోల్ పై 44 టాకాలు మేరకు శుక్రవారం పెంచింది. ఇది చమురు ధరలపై సుమారు 51.2 శాతం వరకు పెంపు అని స్థానిక మీడియా అంచనా వేసింది. బంగ్లాదేశ్‌లో ఈ స్థాయిలో చమురు ధరలు పెంచడం స్వాతంత్ర్యం తర్వాత ఇదే తొలిసారి అని చెబుతున్నది. ఈ పెంపుతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆందోళన బాట పట్టారు.

గుంపులు గుంపులుగా ప్రజలు పెట్రోల్ బంక్‌లను చుట్టుముడుతున్నారు. కొన్ని చోట్ల వాహనాలతో క్యూలు కట్టి ఫ్యూయెల్ ట్యాంకులు ఫుల్ చేసుకుంటున్నారు. ఇంకా చాలా చోట్ల పెట్రోల్ బంక్‌లు కేంద్రంగా ఆందోళనలు చేస్తున్నారు. విద్యార్థి సంఘాలూ ఇందులో పాల్గొన్నారు. రాజధాని ఢాకాలోని నేషనల్ మ్యూజియం ముందు భారీ ఆందోళనలు చేశారు.

సాధారణ ప్రజలు ఇప్పటికే జీవన ప్రమాణాలు పెరగడంతో ఇబ్బందులు పడుతున్నారని ఓ నిరసనకారుడు చెప్పాడు. ప్రభుత్వం తప్పుడు విధానాలతో ప్రజా ధనాన్ని లూటీ చేస్తున్నారని ఆరోపించారు. తద్వార ప్రజలు వేదనకు గురవుతున్నారని పేర్కొన్నాడు.

చమురు ధరల పెంపుతో బస్ ఆపరేటర్లు టికెట్ల ధరను పెంచారు. ఇది ప్రజల ఆగ్రహానికి మరింత ఆజ్యం పోసింది. టికెట్ల ధరల పెంపును బంగ్లాదేశ్ జత్రి కళ్యాణ్ సమితి తీవ్రంగా వ్యతిరేకించింది. సరైన ధరల విశ్లేషణ తర్వాతే టికెట్ల రేట్లు పెంచాలని డిమాండ్ చేసింది. 

అంతర్జాతీయ మార్కెట్ల పరిస్థితుల దృష్ట్యా చమురు ధరల పెంపు అనివార్యంగా మారిందని బంగ్లాదేశ్ మంత్రి ఓ ప్రకటనలో తెలిపారు. బంగ్లాదేశ్ ప్రభుత్వ అధీనంలోని పెట్రోలియం కార్పొరేషన్ గత ఆరు నెలలుగా (జులై వరకు) 8 బిలియన్ల టాకాల కంటే కూడా ఎక్కువే నష్టపోయిందని వివరించారు. పెరిగిన ధరలు ప్రజల్లో అసంతృప్తి పెంచిందని, కానీ, తమకు మరో అవకాశమే లేకపోయిందని తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే