
న్యూఢిల్లీ: క్యూబా దేశంలో పిడుగుపాటు విధ్వంసం సృష్టించింది. మతాంజస్ ప్రావిన్స్‌లో పిడుగు నేరుగా చమురు డిపోపై పడటంతో అగ్ని దావానలంలా లేచింది. కొన్ని మీటర్ల మేరకు ఆకాశంలోకి ఎగిసింది. అగ్నిపర్వతాన్ని తలపించింది. ఈ ఘటనలో 17 మంది అగ్నిమాపక సిబ్బంది అదృశ్యం అయ్యారు. కాగా, 121 మంది తీవ్రంగా గాయపడ్డారు. కనీసం ఒక్కరు మరణించారని వైద్య శాఖ తెలిపింది. ఈ పిడుగుపాటు కారణంగా 1,900 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
శుక్రవారం రాత్రి ఓ పిడుగు మతాంజస్ ప్రావిన్స్‌లో చమురు కేంద్రంపై పడింది. దీంతో అగ్ని శికలు ఎగిరిపడ్డాయి. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పాట్‌కు చేరుకున్నారు. ఆ మంటలను అదుపులోకి తేవడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ, అవి అదుపులోకి రాలేవు. ఈ మంటలు అదుపులోకి రాకపోగా.. పక్కనే ఉన్న మరో ఫ్యుయెల్ ట్యాంక్ వరకు వ్యాపించాయి. దీంతో ఆ ట్యాంకు కూడా ఒక్కసారిగా బద్ధలైంది. దీంతో మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది ప్రమాదంలో పడ్డారు. కనీసం 17 మంది కనిపించకుండా పోయారు.
ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నదని క్యూబా అధ్యక్షుడి ట్విట్టర్ హ్యాండిల్ పేర్కొంది. ఇందులో ముగ్గురి ఆరోగ్య పరిస్థితి సీరియస్ కండీషన్‌లో ఉన్నట్టు వివరించింది. వీరంతా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారిలో ఎనర్జీ మినిస్టర్ లివాన్ అరోంటె తెలిపారు.
17 మంది అగ్నిమాపక సిబ్బంది కనిపించకుండా పోయారని అధ్యక్షుడి కార్యాలయం వెల్లడించింది. వారు మంటలకు చాలా సమీపంగా వెళ్లారని తెలిపింది. చమురు విషయంలో అనుభవం ఉన్న దేశాలు ఈ ప్రమాదాన్ని అదుపులోకి తేవడానికి సహకరించాలని ఇతర దేశాలకు క్యూబా విజ్ఞప్తి చేసింది. ఆ తర్వాత సహాయం అందించడానికి ముందుకు వచ్చిన మెక్సికో, వెనిజులా, రష్యా, నికరాగ్వా, అర్జెంటినా, చిలీలకు ధన్యవాదాలు తెలిపింది.