బాబోయ్.. ఇష్టంగా తిన్న చేపలకూరే ప్రాణాలు తీసింది.. భార్య మృతి, భర్త పరిస్థితి విషమం..

By SumaBala Bukka  |  First Published Apr 3, 2023, 8:44 AM IST

చేపల కూర తిని ఓ దంపతులు తీవ్ర అస్వస్థత పాలయ్యారు. భార్య మృతి చెందగా.. భర్త పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన మలేసియాలో చోటు చేసుకుంది. 


మలేషియా : చేపల కూర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.  ఒకవేళ అంతగా ఇష్టం లేకపోయినా చేపల్లో ఉన్న పోషకాల దృష్ట్యా కూడా తమ భోజనంలో ప్రత్యేకంగా చేరుస్తుంటారు చాలామంది. అయితే ఒక్కోసారి చేపలు విషపూరితమైతే ప్రాణాల మీదికే వస్తుంది. అలాంటి ఘటనే మలేషియాలో మార్చి 25న వెలుగు చూసింది. ఈ విషపూరితమైన చేపల కూరను తిని ఓ మహిళ మృతి చెందింది. ఆ కూర తిన్న ఆమె భర్త  కోమాలోకి చేరుకున్నాడు. అతడి పరిస్థితి కూడా విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలలోకి వెడితే..  జపాన్లో ఎక్కువగా పఫర్ ఫిష్ అనే చేపను ఇష్టంగా తింటారు. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. అదే సమయంలో దీన్ని కనక సరిగా క్లీన్ చేయకపోతే అత్యంత విషపూరితమైనది కూడా. జోహార్ కు చెందిన ఓ వ్యక్తి ఈ ఫిష్ ను  తినాలనుకున్నాడు. దీనికోసం స్థానిక మార్కెట్ నుంచి చేపలను కొనుగోలు చేసి ఇంటికి తీసుకువచ్చాడు. అతని భార్య లిమ్ సీవ్ గ్వాన్ (83)  భర్త ఎంతో ఇష్టంగా తెచ్చిన ఆ చేపలను శుభ్రం చేసి, కూర వండింది.

Latest Videos

షాకింగ్.. అందరూ చూస్తుండగానే మహిళలపై పెరుగుతో దాడి.. బాధితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అసలేం జరిగింది?

ఆ తర్వాత ఇద్దరూ కలిసి చేపల కూరను లొట్టలు వేసుకుంటూ తినేశారు. తిన్న తర్వాత కాసేపటికే ఇద్దరు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. మొదట భార్య గ్వాన్ కు ఒంట్లో వణుకు పుట్టడం మొదలైంది..ఆ తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడింది. కాసేపటికి ఇవే లక్షణాలు భర్తలోనూ కనిపించాయి. వీటిని గమనించిన కుమారుడు వెంటనే తల్లిదండ్రులు ఇద్దరిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించాడు. పరిస్థితిని గమనించి వెంటనే చికిత్స ప్రారంభించిన వైద్యులు వారికి ఆహారంలో విష ప్రయోగం జరిగిందని తెలిపారు. 

చికిత్స తీసుకుంటూ ఆరోజు సాయంత్రం భార్య లిమ్ సీవ్ గ్వాన్ చనిపోయింది. అప్పటికే కోమాలోకి వెళ్లిన గ్వాన్ కు ఐసిలో చికిత్స ఇస్తున్నారు. అతని పరిస్థితి కూడా విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. పఫర్ ఫిష్  తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అవడం వల్లే  ఆ పరిస్థితి తలెత్తిందని  వైద్యులు తెలిపారు. వైద్యులు చెప్పింది విని అతని కొడుకు, కుమార్తెలు షాక్ అయ్యారు. తమ తండ్రి చాలా ఏళ్లుగా  ఇలాంటి చేపలను.. చేపల మార్కెట్లో ఉండే ఆ షాపు నుంచి కొనుక్కొచ్చారని.. కానీ ఎప్పుడూ ఇలా జరగలేదని తెలిపారు. 

రుచికరమైన చేపల కోసం.. ఇంత ప్రమాదకరమైన వాటిని కొని తెచ్చి.. ప్రాణాల మీదికి తెచ్చుకునే వ్యక్తి తన తండ్రి కాదని కొడుకు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటన మీద స్థానిక అధికారులు స్పందించారు. ఆరోజు ఆ దంపతులు తిన్న చేపల వివరాలను సేకరించినట్లు తెలిపారు. అయితే.. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం.. టెట్రోడోటాక్సిన్,  సాక్సి టాక్సిన్  అనే ప్రాణాంతకమైన విషపూరితాలు పఫర్ ఫిష్ లో ఉంటాయి. చేపలను ఫ్రీజ్ చేయడం వలన.. లేదా వండడం వల్ల వాటిలోని ఆ విష పదార్థాలు నాశనం కావని కూడా తెలిపారు. 

అలాగని వీటిలోని విషపూరితాలను తొలగించలేమని కాదని అన్నారు. ఈ విషపదార్థాలను ఆ చేపల నుంచి ఎలా తీయాలి. వాటిని ఎలా వండాలి అనేదానిమీద ప్రత్యేక శిక్షణ తీసుకోవాలని తెలిపారు. అందుకే ఈ చేపలను ఇలాంటి శిక్షణ పొందిన.. నైపుణ్యం కలిగిన చెఫ్ లు మాత్రమే వండగలుగుతారని.. హోటళ్లలో ఇలాంటి నైపుణ్యం కలిగిన చెఫ్ లకు మాత్రమే ఈ చేపల కూర వండడానికి అనుమతి ఉంటుందని వెల్లడించారు. 

click me!