చైనాలో భారీ భూకంపం.. 46 మంది మృతి.. రిక్టర్ స్కేల్ పై 6.6 తీవ్రత

By Mahesh KFirst Published Sep 5, 2022, 11:27 PM IST
Highlights

చైనాలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపంతో నివాసలు కూలిపోయాయి. కొండ చరియలు విరిగిపడి విధ్వంసం జరిగింది. భూకంపం కారణంగా 46 మంది మరణించారు.
 

న్యూఢిల్లీ: చైనాలో భారీ భూకంపం సంభవించింది. చైనాలోని నైరుతి భాగంలో సోమవారం రిక్టర్ స్కేల్ పై 6.6 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు చైనా అధికారిక మీడియా రిపోర్ట్ చేసింది. ఈ భూకంపం కారణంగా 46 మంది మరణించినట్టు వివరించింది. ఈ భూకంప ప్రకంపనలు సుదూర ప్రాంతాలనూ ప్రభావితం చేసినట్టు పేర్కొంది. భూకంపం సంభవించిన ప్రాంతంలో పలు నివాసాలు నేలమట్టం అయ్యాయి. చాలా ఏరియాల్లో కరెంట్ లేకుండా పోయింది.

అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం, సిచువాన్ ప్రావిన్స్‌లోని ఆగ్నేయ నగరం కాంగ్‌డింగ్‌‌కు 43 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నది. పది కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉన్నది. ఈ భూకంప తీవ్రత 6.6 అని పేర్కొంది.

ఈ ప్రావిన్స్ రాజధాని చెంగ్డూలో భూకంప తీవ్రతకు భవనాలు కంపించాయి. కరోనా లాక్‌డౌన్ కారణంగా లక్షలాది మంది ప్రజలు ఇళ్లలోనే నిర్బంధించారు. సమీపంలోని మెగా సిటీ చోంగ్‌క్వింగ్‌లోనూ ఈ భూకంపం తీవ్రంగా సంభవించినట్టు స్థానికులు తెలిపారు.

కనీసం ఒక పట్టణం తీవ్రంగా ధ్వంసం అయిపోయిందని, భూకంపం కారణంగా కొండ చరియలు విరిగిపడి విధ్వంసం జరిగినట్టు సీసీటీవీ పత్రిక పేర్కొంది. పలు పట్టణాల మధ్య రోడ్లు ధ్వంసం అయిపోయాయని, టెలికమ్యూనికేషన్ లైన్లు కూడా నాశనం అయిపోయాయని వివరించింది. పవర్ స్టేషన్స్‌ కూడా ప్రకంపనలు ఎదుర్కొన్నాయి.

కాగా, ఈ భూకంపం తర్వాత టిబెట్ సమీపంలోనూ 4.6 తీవ్రతతో భూ ప్రకంపనలు వచ్చాయని యూఎస్‌జీఎస్ పేర్కొంది. 

భూకంపం రిపోర్ట్ కాగానే వందలాది మంది రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగారు. మంటలను ఆర్పేవారు.. శిథిలాలను తొలగించే వారు వెంటనే తమ పనుల్లో మునిగిపోయారు. ముందు ప్రాణాలు కాపాడటమే ప్రథమ ప్రాధాన్యంగా పెట్టుకోవాలని అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సూచనలు చేశారు. విపత్తు సంబంధ ప్రాంతాల్లో ప్రాణ నష్టం తగ్గించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

click me!