
అమెరికా మీడియా రంగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన వారికి అందించే ప్రతిష్టాత్మక అవార్డు పులిట్జర్. కొలంబియా విశ్వవిద్యాలయం అందించే ఈ అవార్డును గెలుచుకోవాలని అమెరికా జర్నలిస్టులందరి కోరిక. కానీ ప్రతిఏటా కొందరికి మాత్రమే ఈ అవకాశం లభిస్తుంది. తాజాగా 2024 లో అద్భుతంగా పనిచేసిన మీడియా ప్రతినిధులకు పులిట్జర్ అవార్డ్స్ కు ఎంపికచేసారు. తాజాగా వీరిపేర్లను ప్రకటించారు.
ది న్యూయార్క్ టైమ్స్‌కు చెందిన సీనియర్ ఫోటో జర్నలిస్ట్ డగ్ మిల్స్ ఈ అవార్డును గెలుచుకున్నారు. జూలై 2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం సమయంలో డగ్ అద్భుతమైన ఫోటోలను తన కెమెరాలో బంధించాడు. దీంతో న్యూస్ ఫోటోగ్రఫీ విభాగంలో 2025కి గాను ఇతడు పులిట్జర్ బహుమతికి ఎంపికయ్యారు.
డగ్ మిల్స్ 2002 నుండి ది న్యూయార్క్ టైమ్స్ లో సీనియర్ ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. అతడు వైట్ హౌస్ వ్యవహారాలతో పాటు పొలిటికల్ కవరేజ్‌పై దృష్టి సారించారు. నాలుగు దశాబ్దాల అతడి కెరీర్‌లో అమెరికన్ రాజకీయాల్లోని ఎన్నో కీలకమైన క్షణాలను తన కెమెరాలో బంధించాడు.
ఇది మిల్స్‌కు మూడవ పులిట్జర్ బహుమతి. క్లింటన్ ప్రచార కవరేజ్ సమయంలో తీసిన ఫోటోకు 1993లో ఈ అవార్డును గెలుచుకున్నాడు. తరువాత మోనికా లెవిన్స్కీ స్కాండల్‌పై దర్యాప్తు నివేదిక సమయంలో తీసిన ఫోటోలతో మరోసారి ఈ అవార్డును అందుకున్నాడు. ఇప్పుడు ట్రంప్ ప్రచార సమయంలో తీసిన అద్భుతమైన ఫోటోలు ఇతడికి ముచ్చటగా మూడోసారి పులిట్జర్ అవార్డును తెచ్చిపెట్టాయి.