
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ న్యూయార్క్ టైమ్స్‌పై $15 బిలియన్ల "పరువు నష్టం దావా" వేస్తున్నట్లు ప్రకటించారు. "చాలా కాలంగా న్యూయార్క్ టైమ్స్ నాపై స్వేచ్ఛగా అబద్ధాలు చెప్పడానికి, బురద చల్లడానికి, పరువు తీయడానికి అనుమతించాను. కానీ అది ఇప్పుడు ఆగిపోతుంది!" అని ఆయన తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో రాశారు. ఈ పరువునష్టం దావాను ఫ్లోరిడాలో వేస్తున్నట్లు తెలిపారు.
ఆ పత్రికను రాడికల్ లెఫ్ట్ డెమోక్రాట్ పార్టీకి వర్చువల్ ముఖచిత్రంగా ట్రంప్ విమర్శించారు. తన కుటుంబం, వ్యాపారం, అమెరికా ఫస్ట్ ఉద్యమం… ఇలా మొత్తం దేశం గురించి అబద్ధాలు చెబుతోందని ఆరోపించారు. అందుకే ఆ మీడియా సంస్థలపై పరువునష్టం దావా వేస్తున్నట్లు తెలిపారు.
లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్ పై రాసిన కథనాలకు సంబంధించి ట్రంప్ తమపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బెదిరించినట్లు గత వారం న్యూయార్క్ టైమ్స్ వార్తాసంస్థ నివేదించింది. ఇంతలోనే ట్రంప్ కూడా ఈ వ్యవహారంపై స్పందించారు.. తనపై తప్పుడు కథనాలను ప్రచురిస్తోందంటూ న్యూయార్క్ టైమ్స్ పై పరువునష్టం దావా వేస్తున్నారు.
రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటినుండి ట్రంప్ మీడియాపై తన దాడులను తీవ్రతరం చేశారు. తన పరిపాలనను విమర్శించే జర్నలిస్టులను పదేపదే దూషించడం, యాక్సెస్‌ను పరిమితం చేయడం, దావాలు వేయడం చేస్తున్నారు. గతంలో ఎప్స్టీన్‌తో తన స్నేహం గురించి ఒక కథనాన్ని ప్రచురించినందుకు మీడియా దిగ్గజం రూపర్ట్ మర్డోక్, ది వాల్ స్ట్రీట్ జర్నల్‌పై ఆయన కనీసం $10 బిలియన్లకు దావా వేశారు.
ఇక సీబీఎస్ న్యూస్ ఫ్లాగ్‌షిప్ షో "60 మినిట్స్"లో ఎన్నికల కవరేజ్‌పై ట్రంప్ వేసిన దావాను పారామౌంట్ $16 మిలియన్లకు సెటిల్ చేసింది. తన 2024 ఎన్నికల ప్రత్యర్థి కమలా హారిస్‌కు అనుకూలంగా ఆ ప్రోగ్రామ్ ఇంటర్వ్యూను మోసపూరితంగా ఎడిట్ చేసిందని ఆయన ఆరోపించారు.