విదేశాల్లో చికుకున్న వారిని ఇండియాకు తరలించేందుకు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించిన భారత ప్రభుత్వం.. టికెట్ ఖర్చును ప్రయాణికులే భరించాలని తేల్చి చెప్పింది.
ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. చైనాలో మొదలైన ఈ వైరస్ దాదాపు అన్ని దేశాలకు పాకేసింది. ఈ నేపథ్యంలో దానిని అరికట్టేందుకు మన దేశంలో లాక్ డౌన్ విధించారు. ఈ లాక్ డౌన్ కారణంగా మొత్తం నిలిచిపోయాయి. విదేశాలలో చిక్కుకున్న భారతీయులు.. స్వదేశానికి రావడానికి వీలు లేకుండా పోయింది.
దీంతో.. ప్రభుత్వం చొరవ తీసుకొని వారికోసం ప్రత్యేకంగా విమానాలు ఏర్పాటు చేసి మరీ భారత్ కి తీసుకువస్తోంది. ఇందులో భాగంగా.. యూఏఈలో చిక్కుకున్న వారితో బయల్దేరిన రెండు ప్రత్యేక విమానాలు కేరళకు కూడా చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..
విదేశాల్లో చికుకున్న వారిని ఇండియాకు తరలించేందుకు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించిన భారత ప్రభుత్వం.. టికెట్ ఖర్చును ప్రయాణికులే భరించాలని తేల్చి చెప్పింది. దీంతో ఎడారి దేశాల్లో చిక్కుకున్న భారతీయులు.. నగల దుకాణాల వైపు పరుగులు పెడుతున్నారు. లాక్‌డౌన్ కారణంగా భారత కార్మికులు ఉపాధి కోల్పోయి.. రోడ్డున పడ్డారు.
ఎంతో కొంత దాచుకున్న డబ్బు కాస్తా లాక్‌డౌన్ కాలంలో ఖర్చైపోయింది. ఈ నేపథ్యంలో విమానం టికెట్ కొనేందుకు డబ్బులు లేకపోవడంతో.. మరోదారి లేక తమ వద్ద ఉన్న బంగారాన్ని అమ్మేస్తున్నారు. బంగారు అమ్మేయగా వచ్చిన డబ్బులను.. విమానం టికెట్ కొనేందుకు ఉపయోగిస్తున్నారు. ఈ విషయాన్ని యూఏఈలోని బంగారు దుకాణాల యజమానులు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. గత రెండు రోజులుగా బంగారం అమ్మేందుకు జనం పోటెత్తుతున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.