మా టీకాలకు అంత పవర్ లేదు: చైనా బండారాన్ని బయటపెట్టిన అత్యున్నత అధికారి

By Siva KodatiFirst Published Apr 11, 2021, 3:28 PM IST
Highlights

చైనా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌లపై తొలి నుంచి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఆయా దేశాల వాదనలను ఖండిస్తూ వచ్చింది చైనా. అయితే తమ టీకాల డొల్లతనాన్ని ఆ దేశానికి చెందిన ఉన్నతాధికారే స్వయంగా బయటపెట్టారు.

చైనా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌లపై తొలి నుంచి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఆయా దేశాల వాదనలను ఖండిస్తూ వచ్చింది చైనా. అయితే తమ టీకాల డొల్లతనాన్ని ఆ దేశానికి చెందిన ఉన్నతాధికారే స్వయంగా బయటపెట్టారు.

కరోనా మహమ్మారిని ఎదుర్కొనే సామర్థ్యం చైనా టీకాలకు తక్కువేనని తేల్చిచెప్పారు. తమ దేశంలో అభివృద్ధి చేసిన రెండు టీకాలను కలగలిపి.. వాటి సామర్థ్యాన్ని పెంచే యోచనలో ప్రభుత్వం ఉందని చైనా ‘సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌-సీడీసీ’ గావో ఫూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

చైనా వ్యాక్సిన్లకు కరోనా నుంచి కాపాడే సామర్థ్యం స్వల్ప స్థాయిలోనే వుందని... వీటిని వినియోగించాలా? లేదా? అన్నదానిపై చర్చలు జరపుతున్నామని గావో తెలిపారు. అలాగే పశ్చిమ దేశాల టీకాలపై ఒకప్పుడు అక్కసు వెళ్లగక్కిన చైనా.. ఇప్పుడు వాటి సామర్థ్యాన్ని అంగీకరించక తప్పలేదు.

కోవిడ్ టీకాలను తయారు చేయడానికి ఉపయోగించిన ఎంఆర్‌ఎన్‌ఏ పద్ధతిని స్వయంగా గావోయే తప్పుబట్టారు. దీనివల్ల భవిష్యత్తులో అనేక దుష్ప్రభావాలు తలెత్తే అవకాశం ఉందని గతంలో ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

కానీ, ఇప్పుడు గావోయే.. ఎంఆర్‌ఎన్‌ఏ విధానంలో టీకాలు తయారుచేసే ప్రక్రియను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. చైనా కరోనా నిరోధక వ్యాక్సిన్లను సంప్రదాయ టీకా ఉత్పత్తి విధానాన్ని అనుసరించి అభివృద్ధి చేశారు.

కాగా, చైనాకు ఫార్మా దిగ్గజం సినోవ్యాక్ రూపొందించిన కరోనా టీకాకు 50.4 శాతం సామర్థ్యం ఉందని బ్రెజిల్‌ తేల్చింది. అదే అమెరికాలో అభివృద్ధి చేసిన ఫైజర్‌ టీకా సామర్థ్యం 97 శాతం అని రుజువైంది.

ఇప్పటి వరకు చైనాలో 34 మిలియన్ల మందికి రెండు డోసుల టీకాను అందించగా, మరో 64 మిలియన్ల మందికి ఒక డోసు వేశారు. టీకా దౌత్యం పేరిట వివిధ దేశాలను తన బుట్టలో వేసుకునేందుకు చైనా శాయశక్తులా ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా కొన్ని కోట్ల డోసులను వివిధ దేశాలకు సరఫరా చేసింది. 

click me!