
జకార్తా: గూగుల్ ను నమ్ముకుంటే పెళ్లి కూతురే మారిపోయిన విచిత్ర సంఘటన ఇండోనేషియాలో చోటుచేసుకుంది. పెళ్లికూతురు ఇంటి అడ్రస్ ను గూగుల్ మ్యాప్ సాయంతో వెతుక్కోగా అదికాస్తా మరో ఇంటికి తీసుకెళ్లింది. ఈ గందరగోళం చాలాసేపు కోనసాగి చివరకు మరో అమ్మాయితో నిశ్చితార్థం జరిగి పెళ్లి ఖాయమయ్యే సమయానికి అసలు నిజం బయటపడింది. దీంతో అందరూ నాలుక్కరుచుకున్నారు.
వివరాల్లోకి వెళితే... ఇండోనేషియాకు చెందిన ఓ యువకుడు కుటుంబంతో కలిసి సెంట్రల్ జావాలోని లొసారి హామ్లెట్ కు పెళ్లిచూపులకు బయలుదేరాడు. అయితే అమ్మాయి ఇంటికి అడ్రస్ తెలియకపోవడంతో గూగుల్ మ్యాప్ సాయాన్ని తీసుకున్నాడు. కానీ గూగుల్ వారిని సమీపంలోని జెంగ్‌కోల్ హామ్లెట్ అనే మరో గ్రామానికి తీసుకెళ్లింది. అక్కడ ఓ పెళ్లిమండపంలో హడావుడి ఉండటంతో సరాసరి అందులోకి వెళ్లారు.
ఆ మండపంలో మారియా అనే యువతికి బుర్హాన్ అనే యువకుడికి నిశ్చితార్థం జరగాల్సివుంది. వారంతా బుర్హాన్ కోసం ఎదురుచూస్తుండగా ఇంతలోనే వీరు వచ్చారు. దీంతో గూగుల్ మ్యాప్ బ్యాచే పెళ్లివారు అనుకుని నిశ్చితార్థానికి సిద్దమయ్యారు. కాస్సేపు గందరగోళం అలాగే కొనసాగి చివరకు అసలు విషయం బయటపడింది. వచ్చినవారు తాము మరోచోటకు వచ్చినట్టు గుర్తించగా మారియా కుటుంబం కూడా గందరగోళాన్ని గుర్తించారు. దీంతో ఎవరిదారిన వారు వెళ్లడంతో కథ సుఖాంతమయ్యింది. లేదంటే ఒకరికి బదులు మరొకరితో నిశ్చితార్థం జరిగేది.