క్లిష్ట సమయంలో భారత్... లడఖ్ సరిహద్దుల్లోకి చొచ్చుకొచ్చిన చైనా ఆర్మీ

By Siva KodatiFirst Published May 19, 2021, 2:45 PM IST
Highlights

ప్రస్తుతం భారత్ కోవిడ్ మహమ్మారితో అల్లాడుతున్న సమయంలో పొరుగు దేశంగా చేతనైనంత సాయం చేయాల్సింది పోయి.. దీనిని అదనుగా చేసుకుని సరిహద్దుల్లో కుట్రలు చేస్తోంది చైనా. భారత సరిహద్దుల్లో మ‌ళ్లీ చైనా సైన్యం విన్యాసాలు ప్రారంభించింది

ప్రస్తుతం భారత్ కోవిడ్ మహమ్మారితో అల్లాడుతున్న సమయంలో పొరుగు దేశంగా చేతనైనంత సాయం చేయాల్సింది పోయి.. దీనిని అదనుగా చేసుకుని సరిహద్దుల్లో కుట్రలు చేస్తోంది చైనా. భారత సరిహద్దుల్లో మ‌ళ్లీ చైనా సైన్యం విన్యాసాలు ప్రారంభించింది.

తూర్పు ల‌ఢ‌ఖ్ సెక్టార్‌కు స‌మీపంలో చైనా సైనిక విన్యాసాలు చేస్తుండ‌డాన్ని భార‌త్ గుర్తించింది. ఇదే సమయంలో చైనా సైన్యం తీరును నిశితంగా ప‌రిశీలిస్తోంది. స‌రిహ‌ద్దుల మీదుగా కొన్ని గంట‌ల్లోనే భార‌త భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు వీలు ఉన్న ప్రాంతాల్లో చైనా సైన్యం ఉంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు తెలిపాయి.

అంతేకాకుండా, ఆయా ప్రాంతాల్లో మౌలిక వ‌స‌తుల‌ను చైనా అభివృద్ధి చేస్తోంది. గతేడాది ఇదే స‌మ‌యంలో చైనా-భార‌త్ సైన్యాలు తూర్పు ల‌ఢ‌ఖ్ ప్రాంతంలో భారీగా మోహ‌రించిన విష‌యం తెలిసిందే. అనేక ద‌శల చ‌ర్చ‌ల అనంత‌రం ఇరు దేశాల సైనికులు వెన‌క్కి వచ్చాయి. అయితే, చైనా మ‌ళ్లీ త‌న వక్రబుద్ధిని చూపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Also Read:ఓ వైపు కరోనాతో భారత్‌ విలవిల.. మారని డ్రాగన్ బుద్ధి, సరిహద్దుల్లో మళ్లీ అలజడి

కొద్దిరోజుల క్రితం భారత సరిహద్దుల్లోకి ఆధునికీకరించిన రాకెట్ లాంచర్లను డ్రాగన్ తరలించింది. టిబెట్ వద్ద ఉన్న ఓ స్థావరంలో వీటిని మోహరిస్తోంది. ఇక్కడి షిన్ జియాంగ్ మిలిటరీ కమాండ్ గాల్వన్ లోయకు సమీపంలోనే ఉంటుంది. గతేడాది గాల్వన్ లోయలో భారత, చైనా బలగాల మధ్య ఘర్షణలు జరిగి ఇరువైపులా ప్రాణనష్టం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.

యుద్ధ రంగంలో కీలకంగా భావించే రాకెట్ లాంచర్లను చైనా తరలించడం వ్యూహాత్మకమేనని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాకెట్ దాడులతో ప్రత్యర్థి పదాతి బలగాలను ఆత్మరక్షణలోకి నెట్టడం సాధ్యమవుతుంది.

షిన్ జియాంగ్ మిలిటరీ కమాండ్ స్థావరానికి రాకెట్ లాంచర్ల తరలింపును చైనా అధికారిక మీడియా సంస్థ సీసీటీవీ వెల్లడించింది. ఇక్కడ మోహరించిన వాటిలో పీహెచ్ఎల్-03 రాకెట్ లాంచర్లు, శతఘ్నులు ఉన్నట్టు తెలుస్తోంది. 

click me!