అప్పుడు అజార్.. ఇప్పుడు కుల్‌భూషణ్: పాక్‌కు చైనా పోట్లు

By Siva KodatiFirst Published Jul 18, 2019, 6:07 PM IST
Highlights

ఎన్నో విషయాల్లో పాకిస్తాన్‌కు అండగా నిలబడిన చైనా.. ఇటీవలి కాలంలో వెనక్కి తగ్గుతున్నట్లుగా తెలుస్తోంది. గతంలో జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ విషయంలోనూ.. తాజాగా కుల్‌భూషణ్ జాదవ్ వ్యవహారంలోనూ చైనా నుంచి పాకిస్తాన్‌కు ఆశించిన సాయం అందలేదు.

అంతర్జాతీయంగా.. దౌత్యపరంగా భారత్‌ను ఇరుకున పెట్టేందుకు పాకిస్తాన్ కుల్‌భూషణ్‌ను ఒక ఆయుధంగా వాడుకునేందుకు పావులు కదిపిన సంగతి తెలిసిందే. అయితే దాయాదీ ఆశలపై నీళ్లు చల్లుతూ అంతర్జాతీయ న్యాయస్థానం.. జాదవ్‌ ఉరిశిక్షను నిలుపుదల చేస్తూ ఆదేశించింది.

అయితే భారత్‌కు ఇంతటి దౌత్య విజయం వెనుక దాదాపు 15 దేశాల న్యాయమూర్తులు అండగా నిలిచారు.  మొత్తం 16 మంది న్యాయమూర్తుల్లో పాకిస్తాన్‌కు చెందిన తస్సాదుఖ్ హుస్సేన్ జిలానీ మాత్రమే తన మాతృదేశానికి మద్ధతుగా నిలిచారు.

పాక్‌ను అనేక సందర్భాల్లో గట్టెక్కించిన చైనా సైతం భారత్‌కు మద్ధతుగా నిలవడం విశేషం. కోర్టు ఉపాధ్యక్ష పదవిలో ఉన్న చైనా జడ్జి జూ హన్‌కిన్ భారత్‌కు అనుకూలంగా ఆమోదముద్ర వేశాడు.

అంతేకాకుండా ఇస్లాం దేశాల న్యాయమూర్తులు సైతం జాదవ్‌కు అండగా నిలిచారు. వియన్నా ఒప్పందం ప్రకారం భారత దౌత్య అధికారులు వెంటనే జాదవ్‌ను కలిసేందుకు అవకాశం కల్పించాలని న్యాయస్థానం ఆదేశించింది.

అతనికి న్యాయ సహాయం అందించేందుకు భారత్‌కు హక్కు వుందని తెలిపింది. ఈ సంఘటన ద్వారా అంతర్జాతీయంగా తనకున్న పలుకుబడిని భారత్ మరోసారి చూపించగా... మౌలనా మసూద్ అజార్ విషయంలోనూ.. ఇప్పుడు కుల్‌భూషణ్ జాదవ్ విషయంలోనూ చైనా తమకు అండగా నిలవకపోవడంతో పాకిస్తాన్ విస్మయం వ్యక్తం చేసింది. 

click me!
Last Updated Jul 18, 2019, 6:07 PM IST
click me!