
న్యూఢిల్లీ: మీరు ఎప్పుడైనా మీరు ఎక్కాల్సిన విమానం కోసం విమానాశ్రయంలో వెయిట్ చేశారా? అదొక విచిత్ర అనుభవాన్ని మనకు మిగుల్చుతుంది. అక్కడ మనకు చాలా రకాల మనుషులు తారసపడతారు. కొందరు షాపింగుల్లో మునిగిపోతే.. ఇంకొందరు వారు ప్రయాణించాల్సిన విమానం కోసం పరుగులు పెడుతుంటారు. ఇంకొందరు కునుకు తీస్తుంటే.. మరికొందరు లైట్ ఫుడ్ తింటూ కనిపిస్తుంటారు. మరికొందరు టైమ్ పాస్ చేస్తూ చిల్‌గా ఉంటారు. ఇదంతా కేవలం తాత్కాలికంగానే.. అంటే కొన్ని గంటలపాటు ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ కొత్త గుంపు వచ్చి చేరుతుంది. కానీ, ఏళ్ల తరబడి ఏ వ్యక్తి అయినా ఎయిర్‌పోర్టులో ఉన్నట్టు మీరు చూశారా?
ప్రపంచంలోనే బిజీగా ఉండే రెండో విమానాశ్రయం బీజింగ్ ఇంట ర్నేషనల్ ఎయిర్‌పోర్టులో మీకు అలాంటి ఓ వ్యక్తి కనిపిస్తాడు. తన ఇంటావిడ పోరు భరించలేక కుటుంబాన్ని దూరంగా ఉండటానికి ఆయన ఎయిర్‌పోర్టును నమ్ముకున్నాడు. 2008లో తన భార్యతో గొడవ పెట్టుకున్న తర్వాత వి జువాంగో ఇల్లు వదిలిపెట్టాడు. అప్పటి నుంచి తాను నివసించడానికి బీజింగ్ క్యాపిటల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును ఎంచుకున్నాడు. ఈ ఎయిర్‌పోర్టులో మూడు టర్మినల్స్ ఉన్నాయి. ఆయన టర్మినల్ 2ను తన నివాసానికి ఎంచుకున్నాడు.
ఉద్యోగం కోల్పోయిన తర్వాత ఆ వ్యక్తి విపరీతంగా తాగడం మొదలు పెట్టాడు. ఆల్కహాల్‌తో పాటు సిగరెట్ల స్మోకింగ్ కూడా హద్దు మీరింది. దీనిపై ఆయన భార్య తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఆ రెండింటిని మానేయాలని ఆమె తరుచూ జువాంగోతో గొడవ పెట్టుకునేది. లేదంటే.. చైనా ప్రభుత్వం ఇచ్చే సుమారు 1000 యువాన్లు అలవెన్సులను తనకు ఇచ్చేయాలని వాదించింది. జువాంగోకు అవి రెండు కష్టమైన మార్గాలుగా తోచాయి. చివరకు ఇల్లు వదిలిపెట్టాలనే నిర్ణయం తీసుకున్నాడు.
చైనా డైలీతో ఆయన మాట్లాడుతూ, ‘నేను ఇంటికి వెళ్లే ప్రసక్తే లేదు. ఎందుకంటే నాకు అక్కడ ఫ్రీడమ్ లేదు. నేను మా ఇంట్లో ఉండాలంటే నా కుటుంబం ఒక షరతు పెట్టింది. నేను ఆల్కహాల్ సేవించడం, పొగతాగడం మానేయాలి. అవి చేయలేకపోతే ప్రభత్వం నెలవారీగా అందించే సుమారు 1000 యువాన్ల అలవెన్సులను వారికి ఇవ్వాలి. ఒక వేళ ఈ డబ్బులే వారికి ఇస్తే నేను సిగరెట్లు, ఆల్కహాల్ కొనుక్కునేదెలా?’ అని జువాంగో అన్నారు.
అందుకే తాను ఇంటికి వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ వెళ్లకుండా ఎయిర్‌పోర్టుకే పరిమితం అయ్యాడు. ఎలక్ట్రిక్ కుక్కర్, ఇతర పరికరాలు కలుపుకుని ఆయన ఓ మొబైల్ కిచెన్ ఏర్పాటు చేసుకోగలిగాడు. ఇలా ఎయిర్‌పోర్టులో ఉండటం తనకు సంతోషంగా ఉన్నదని, తనకు కావాల్సింది ఏదైనా సరే వెంటనే కొనుక్కోవచ్చని వివరించాడు. వంట చేసుకోగా మిగిలిన సమయంలో తాను బయటి ఫుడ్ విమానాశ్రయంలోని షాపుల చుట్టూ తిరుగుతాడని తెలిపారు.
ఇలా ఎయిర్‌పోర్టుకే పరిమితం అయిన వ్యక్తి జువాంగోనే కాదు.. మెహ్రాన్ కరీమీ నాస్సరీ అనే ఇరాన్ శరణార్థి కూడా ప్యారిస్ ఎయిర్‌పోర్టు ప్యారిస్ చార్లెస్ డీ గాల్‌లో 18 ఏళ్లుగా ఉన్నారు. నాస్సరీ 18 ఏళ్లుగా అంటే 2006 నుంచి ఆ ప్యారిస్ ఎయిర్‌పోర్టులోనే గడిపారు. అటు బ్రిటీష్ అధికారులు, ఇటు ఫ్రెంచ్ అధికారులు నాస్సరీని తమ తమ దేశాల్లోకి అనుమతించడానికి నిరాకరించడంతో ఎయిర్‌పోర్టులోనే చిక్కుకుపోవాల్సి వచ్చింది. కానీ, జువాంగో పరిస్థితి వేరు. ఆయనకు ఇంటికి వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ వెళ్లడం లేదు. నాస్సరీ ఆరోగ్యం క్షీణిచండంతో నాస్సరీ 2006లో ఎయిర్‌పోర్టు నుంచి ఆస్పత్రికి వెళ్లిపోయారు.