అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం మధ్య బోయింగ్ విమానాల డెలివరీ నిలిచిపోయింది. దీంతో ఏవియేషన్ పరిశ్రమపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది.
అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం కొత్త మలుపు తిరిగింది. బ్లూమ్‌బెర్గ్ న్యూస్ నివేదిక ప్రకారం చైనా తన ఎయిర్‌లైన్స్‌కు బోయింగ్ నుండి కొత్త జెట్ డెలివరీలను నిలిపివేయాలని ఆదేశించింది. అంతేకాకుండా అమెరికా నుండి విమాన పరికరాలు, విడిభాగాల కొనుగోలును కూడా నిలిపివేసింది. ఈ నిర్ణయం వాణిజ్య యుద్ధాన్ని వ్యూహాత్మక రంగాలైన ఏవియేషన్, టెక్నాలజీకి విస్తరింపజేసింది. బోయింగ్ వంటి అమెరికన్ కంపెనీలపై ప్రభావం చూపే ఈ చర్యలు ప్రపంచ ఏవియేషన్ పరిశ్రమను కుదిపేయవచ్చు.
చైనాపై అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిస్పందనగా ఈ చర్య తీసుకున్నట్లు నివేదిక పేర్కొంది. అమెరికా ఇప్పటివరకు చైనా ఉత్పత్తులపై 145% వరకు సుంకం విధించగా, చైనా కూడా అమెరికన్ వస్తువులపై 125% వరకు పన్ను విధించింది. అమెరికా చర్యలను చట్టవిరుద్ధమైన బెదిరింపులని చైనా అభివర్ణించింది. అమెరికా వైఖరి అన్యాయమని, దానిని తాము సహించబోమని చైనా పేర్కొంది.
బోయింగ్ జెట్‌లను లీజుకు తీసుకుంటున్న, ఇప్పుడు అధిక ధరలను ఎదుర్కొంటున్న ఎయిర్‌లైన్స్‌కు చైనా ప్రభుత్వం సహాయం చేయాలని భావిస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదిక పేర్కొంది.
డోనాల్డ్ ట్రంప్ దూకుడు సుంకాల విధానం ప్రపంచ మార్కెట్లను కుదిపేసింది, అమెరికా సాంప్రదాయ మిత్రదేశాలు, ప్రత్యర్థులతో దౌత్య సంబంధాలను ప్రభావితం చేసింది. అయితే, గత వారం అమెరికా స్మార్ట్‌ఫోన్‌లు, సెమీకండక్టర్లు, కంప్యూటర్లు వంటి కొన్ని హైటెక్ వస్తువులపై సుంకాలను మినహాయించినప్పటికీ, బోయింగ్ వంటి పరిశ్రమలకు ఎలాంటి ఉపశమనం లభించలేదు.