
రష్యా దాడుల నేపథ్యంలో (russia ukraine war) ఉక్రెయిన్‌లోని భారతీయులకు, మరీ ముఖ్యంగా విద్యార్థులను రక్షించేందుకు మార్గాలను భారత ప్రభుత్వం అన్వేషిస్తోంది. ఈ సంఘర్షణకు ఇప్పట్లో తెరపడే అవకాశాలు లేకపోవడంతో భారత్ అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఉక్రెయిన్‌లో అత్యంత వేగంగా మారుతున్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి. ఆ దేశంలోని భారతీయులను, విద్యార్థులను కాపాడేందుకుగల మార్గాలను అన్వేషిస్తున్నామని తెలిపారు. కొద్దిరోజుల క్రితం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను మరింత విస్తరించి, నిరంతరం పని చేసేలా ఆదేశించినట్లు తెలిపారు.
ఉక్రెయిన్ గగనతలాన్ని మూసివేసినందున అక్కడ ఉన్న భారతీయులను తీసుకొచ్చేందుకు ప్రత్యేక విమానాన్ని పంపించడానికి అవకాశం లేకుండా పోయింది. ఇండియన్ ఎంబసీ సిబ్బందిని (indian embassy) తీసుకురావడానికి కూడా విమానాన్ని పంపించడం సాధ్యం కావడం లేదు. సామాన్య ప్రజల భద్రతకు విఘాతం కలిగే అవకాశం ఉన్నందువల్ల పౌర విమానాలను అనుమతించబోమని ఉక్రెయిన్ ప్రభుత్వం తెలిపింది. ఉక్రెయిన్‌లో దాదాపు 20,000 మంది భారతీయులు చిక్కుకున్నట్లు అంచనా.
రెండు మూడు రోజుల వరకు సాధారణంగానే వున్న పరిస్ధితులు.. గురువారం ఉదయం నాటికి మారిపోయాయి. అక్కడున్న భారత పౌరులకు మన రాయబార కార్యాలయం కీలక సూచనలు చేసింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు ఎవ్వరూ రావద్దని సూచించింది. ముఖ్యంగా కీవ్ పశ్చిమ ప్రాంతాల నుంచి రాజధానికి వచ్చే వారిని తిరిగి ఆయా నగరాలకు వెళ్లిపోవాలని హెచ్చరించింది. వీలైతే పశ్చిమ సరిహద్దు దేశాలతోపాటు సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని ఇండియన్ ఎంబసీ సూచించింది.
గత కొన్నిరోజులుగా ట్రావెల్ అడ్వైజరీలు జారీ చేస్తుండటంతో ఉక్రెయిన్‌లో వున్న భారతీయ విద్యార్ధులు, ప్రజలు.. స్వదేశానికి వెళ్లేందుకు విమానాశ్రయానికి చేరుకుని సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇందులో కొందరు తెలుగు విద్యార్థులు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే, వారందరూ భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించేందుకు ప్రయత్నం చేసినప్పటికీ ఎవరూ స్పందించట్లేదు.
ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన ఓ తెలుగు విద్యార్ధి.. ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు వీడియో కాల్ ద్వారా అక్కడి పరిస్ధితిని వివరించాడు. ‘‘ నిన్నటి వరకు పరిస్ధితి బాగానే వుందని అతను తెలిపాడు. ఉదయం విమానాశ్రయం వద్ద అటాక్ జరిగిన తర్వాతి నుంచి ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయని.. టీవీల ద్వారా విషయం తెలుసుకుంటున్న తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. వెంటనే ట్రావెల్ ఏజెంట్ల్ ద్వారా ఇండియన్ ఎంబసీని కాంటాక్ట్ చేస్తున్నారని పేర్కొన్నాడు. సేఫ్ అని చెప్పలేం.. కానీ హాస్టల్స్ నుంచి బయటకు రావొద్దని ఎంబసీ హెచ్చరించిందని అతను తెలిపాడు. మూడు వైపుల నుంచి రష్యా సేనలు చుట్టుముట్టడంతో భారతీయ విద్యార్ధుల పరిస్ధితి అయోమయంగా మారింది. దీంతో రంగంలోకి భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ (s jaishankar) రంగంలోకి దిగారు.