వచ్చే ఎన్నికల్లో గెలవాలి.. లేదంటే హత్యకు గురవ్వడం తథ్యం: అధ్యక్షుడి ఆందోళన

By telugu teamFirst Published Aug 29, 2021, 12:22 PM IST
Highlights

వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలవాలని లేదంటే హత్యకు గురవ్వడమే మిగిలి ఉంటుందని బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో అన్నారు. తన ముందు మూడు అవకాశాలున్నాయని, ఒకటి వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందడమా? లేక హత్యకుగురవ్వడం లేదా అరెస్టు అయి ఊచలు లెక్కించడమా? అని తెలిపారు. చాలా అంచనాల పోల్స్‌లో బోల్సోనారో కంటే మాజీ అధ్యక్షుడు లులా డ సిల్వా ముందంజలో ఉండటం గమనార్హం.
 

బ్రెసీలియా: బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో తన భవిష్యత్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది ఎన్నికల్లో తాను గెలవాలని చెప్పారు. లేదంటే తాను హత్యకు గురవ్వడమే మిగిలున్న ఆప్షన్ అని ఆందోళన చెందారు. ఎన్నికల్లో గెలవడమా? లేక హత్యకు గురవ్వడమా? లేదంటే అరెస్టు అయి జైలులో ఊచలు లెక్కించడమా? ఇవి మూడే తన ముందున్న చాయిస్‌లని తెలిపారు. ఆ దేశంలోని సద్గురువులతో ఆయన భేటీ అయిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు. అతివాద భావాలున్నట్టుగా ఆరోపణలున్న బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోకు దేశవ్యాప్తంగా వ్యతిరేక గాలులు వీస్తున్నాయి.

‘నా భవిష్యత్‌పై నాకు మూడే ప్రత్యామ్నాయాలున్నాయి. అరెస్టుకావడం, హత్యకు గురవ్వడం, లేదా ఎన్నికల్లో విజయాన్ని సాధించడం’ అని అధ్యక్షుడు జైర్ బోల్సోనారో తెలిపారు. మొదటి ఆప్షన్ తన ప్రశ్నకు సమాధానంగా ఉండబోదన్నారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో తనను భయపెట్టేవారు లేరని హూంకరించారు.

బ్రెజిల్‌లో వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ, చాలా అంచనాల పోల్స్‌లో లెఫ్టిస్ట్ మాజీ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియా లులా డ సిల్వానే తనపై ముందంజలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన బ్రెజిల్ ఎలక్ట్రానిక్ వోటింగ్ వ్యవస్థను విమర్శించారు. ఈ సిస్టమ్ ఆధారంగా జరిగే ఎన్నికల ఫలితాలను తాను అంగీకరించబోనని స్పష్టం చేశారు. కచ్చితంగా ప్రింటెడ్ రశీదుల విధానాన్నే ఎన్నికలకు ఎంచుకోవాలని సూచించారు. ఎలక్ట్రానిక్ బ్యాలెట్లు ఫ్రాడ్ చేయడానికి అవకాశముందని ఆరోపించారు. కాగా, ఎలక్ట్రానిక్ వోటింగ్ సిస్టమ్‌ను ఎలక్టోరల్ కోర్ట్ సమర్థించింది. ప్రింటెడ్ బ్యాలెట్లను ఎంచుకోవాలన్న చర్చ అర్థరహితమని పేర్కొంది.

click me!