
ఉక్రెయిన్ పై రష్యా దాడి (russia ukraine war) కొనసాగుతోంది. పుతిన్ ఆదేశాలతో మరింత దూకుడుగా ముందుకుసాగుతూ.. భీకర దాడులు చేస్తున్నాయి రష్యా సేనలు. ఆంక్షలను ఏమాత్రం పట్టించుకోకుండా రష్యా మరింత దూకుడు ప్రదర్శిస్తుండటంతో అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే శాంతియుతంగా ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని చాలా దేశాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. అయినప్పటికీ రష్యా ఏమాత్రం పట్టించుకోకుండా దూకుడుగా ముందుకు సాగుతూ.. ఉక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే పలు మార్లు ఆ దేశ నేతలు అణుబాంబు దాడులు గురించి ప్రస్తావించడం ఉక్రెయిన్ తో పాటు యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.
కాగా.. ఉక్రెయిన్‌లో రష్యా బలగాల దాడిలో అమెరికా జర్నలిస్ట్ (american journalist) ఒకరు మృతి చెందాడు. న్యూయార్క్ టైమ్స్‌లో (new york times) పనిచేస్తున్న అతనిని బ్రెంట్ రెనాడ్‌గా (brent renaud) గుర్తించారు. ఈ ఘటనలో మరో జర్నలిస్ట్ గాయపడ్డట్లు ఉక్రెయిన్ అధికారులు ధ్రువీకరించారు. కీవ్ (kyiv) సమీపంలోని శరణార్థుల కాన్వాయ్‌పై రష్యన్ సైన్యం దాడి చేయడంతో ఓ చిన్నారి సహా ఏడుగురు పౌరులు మృతి చెందారని ఉక్రెయిన్ పేర్కొంది. ఇరుదేశాల మధ్య యుద్ధం ఆదివారం నాటికి 18వ రోజుకు చేరగా.. ఉక్రెయిన్ సైతం తీవ్రంగా ప్రతిఘటిస్తున్నది. ఇప్పటివరకు 13 వేల మందికిపైగా రష్యా సైనికులను హతమార్చినట్లు ఉక్రెయిన్ పేర్కొంది. మరోవైపు ఉక్రెయిన్‌కు 200 మిలియన్ డాలర్ల సైనిక సాయాన్ని అందజేస్తామని అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు రష్యా దాడులు సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకున్నాయని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే వందలాది మంది ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారని చెబుతోంది. రాజధాని కీవ్ నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుచా నగరంలో 67 మంది పౌరులను ఖననం చేసిన సామూహిక సమాధి చిత్రాన్ని ఉక్రెయిన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రీట్వీట్ చేసింది. ఇది ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
“రష్యన్ ఆక్రమణదారులచే చంపబడిన 67 మంది పౌరులను కైవ్‌లోని బుచా నగరంలోని చర్చి భూభాగంలోని సామూహిక సమాధిలో ఖననం చేశారు. మరికొందరు బాధితులను కూడా గుర్తించలేదు. ఈ భయానక 21వ శతాబ్దంలో ఈ రోజు మన వాస్తవికత! అని ట్వీట్ చేశారు. స్వచ్ఛంద సేవకులు చనిపోయిన వారిని సామూహిక సమాధిలోకి లాగుతున్నట్లు చూపించే వీడియో కూడా ఇంటర్నెట్‌లో వైరల్ గా మారింది.