
న్యూఢిల్లీ: దక్షిణ కొరియాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రెండు సంవత్సరాల కోవిడ్ నిబంధనలతో విసిగి వేసారిన ప్రజలు ఈ పూట అంతా బయటకు వచ్చారు. హాలోవీన్ పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడానికి అందరూ ప్లాన్ చేసుకున్నారు. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోని ఓ మార్కెట్‌లో ఈ జనమంతా కిక్కిరిసిపోయారు. అప్పటికే అక్కడి నుంచి బయటపడ్డవారు.. అటు వైపుగా వెళ్లకూడదని, నియంత్రణకు కూడా వీలుపడని స్థాయిలో రద్దీ అక్కడ ఉన్నదని సోషల్ మీడియాలో వార్నింగ్‌లు పెట్టుకున్నారు. జరగని రాని ఘోరం జరిగిపోయింది. దాదాపు తొక్కిసలాటగా మారిన ఆ మార్కెట్ ప్రాంతంలో కనీసం 50 మందికి పైగా నేలపై కూలిపోయి కొన ఊపిరితో పోరాడుతున్నారు. కనీసం 50 మందికి గుండెపోటు వచ్చింది. పోలీసులు వెంటనే వారి వద్దకు చేరి వారి చాతిపై చేతులతో నొక్కుతున్నారు. వారిని మళ్లీ లేపడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన భయానక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సియోల్ సెంట్రల్ డిస్ట్రిక్ట్‌లో ఓ ఇరుకైన మార్కెట్ ఉన్నది. ఆ మార్కెట్ దగ్గరే ఈ పరిస్థితులు కనిపించాయి. హాలోవీన్ కారణంగా శనివారం రాత్రి వారంతా సెంట్రల్ డిస్ట్రిక్ట్ ఇటెవోన్‌కు చేరుకున్నారు. స్థానిక కాలమానం ప్రకారం, అర్ధరాత్రికి కొన్ని నిమిషాల ముందు ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. రద్దీ కారణంగా చాలా మంది నేలపై పడిపోయారు. ఓ హోటల్ సమీపంలో డజన్ల కొద్దీ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారని ది కొరియన్ హెరాల్డ్ రిపోర్ట్ చేసింది.
సుమారు 11.30 గంటల ప్రాంతంలో తమకు 81 ఫోన్ కాల్స్ వచ్చాయని, వారికి ఊపిరి ఆడటం లేదని రిపోర్ట్ చేసినట్టు ఫైర్ డిపార్ట్‌మెంట్ అధికారులు తెలిపారు. స్పాట్‌కు వెంటనే 140కి మించి అంబులెన్స్‌లు పంపించామని వివరించారు.
ఇటెవోన్‌లో దృశ్యాలు గందరగోళంగా ఉన్నాయని, తమ దేశంలో హాలోవీన్ అతి భయంకర రాత్రుల్లో ఇది మిగిలిపోతుందని తెలిపారు.
ఈ రద్దీకి ముందు కొందరు సోషల్ మీడియాలో హెచ్చరికలు చేశారు. ‘ఇటెవోన్‌కు రావొద్దు.. ఇక్కడ దాదాపు నరకంలా ఉన్నది. నా చేతులు దాదాపు విరిగిపోయినంత పని జరిగింది’ అని ఒక మహిళ ట్వీట్ చేశారు. ఇక్కడ రద్దీ నియంత్రణకు సాధ్యపడని విధంగా ఉన్నదని తెలిపారు.
బాధితులు అందరికీ సహాయం అందించడానికి అన్ని మంత్రిత్వ శాఖలు సమన్వయంతో కలిసి పని చేయాలని అధ్యక్షుడు యూ సుక్ యోల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.