
ఖార్కివ్ నగరం (kharkiv) బాంబుల మోతతో దద్దరిల్లుతోంది. రష్యా సేనలు (russian army) మిస్సెల్స్‌తో విరుచుకుపడుతున్నాయి. జనావాసాలను సైతం టార్గెట్ చేస్తున్నారు రష్యా సైనికులు. ఉదయం నుంచి క్షిపణుల దాడులు కొనసాగుతున్నాయి. ఈ ఘటనల్లో భారీగా ప్రాణ, ఆస్తి నష్టాలు జరిగినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు 20 మందికి పైగా చనిపోయినట్లు మేయర్ ప్రకటించారు. ఖర్కీవ్ దగ్గర రష్యా దాడులు.. విద్యార్ధుల తరలింపునకు అడ్డంకిగా మారింది. ఈ క్రమంలో విద్యార్ధుల తరలింపునకు సురక్షిత మార్గం కల్పించాలని రష్యా, ఉక్రెయిన్‌లను కోరింది కేంద్ర విదేశాంగ శాఖ .
Kharkivలోని ఒక అడ్మినిస్ట్రేటివ్ భవనంపై జరిగిన దాడికి సంబంధించిన వీడియోను ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌లో షేర్ చేసింది. రష్యన్ క్షిపణి భవనాన్ని తాకడంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం కనిపిస్తుంది. ఆ సమయంలో రోడ్డుపై పెద్ద సంఖ్యలో వాహనాలు ఉండటం కూడా ఈ వీడియోలో చూడొచ్చు.
రష్యా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ పౌరులను లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపిస్తూ ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ ట్వీట్ చేసింది, "అంతర్జాతీయ మానవతా చట్టాలను ఉల్లంఘిస్తూ రష్యా యుద్ధం చేస్తోంది. పౌరులను చంపుతుంది. పౌర మౌలిక సదుపాయాలను నాశనం చేస్తుంది. ఇప్పుడు క్షిపణుల ద్వారా పెద్ద నగరాలపై కాల్పులు జరపడమే రష్యా ప్రధాన లక్ష్యం’ అని ట్వీట్‌లో పేర్కొంది.
ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి Dmytro Kuleba కూడా క్షిపణి దాడి దృశ్యాలను ట్వీట్ చేశారు. ‘ఖార్కివ్‌లోని సెంట్రల్ ఫ్రీడమ్ స్క్వేర్, రెసిడెన్షియల్ డిస్ట్రిక్ట్‌లపై అనాగరికంగా రష్యన్ క్షిపణి దాడులు చేసింది. పుతిన్ ఉక్రెయిన్‌ను విచ్ఛిన్నం చేయలేకపోయాడు. అతను కోపంతో మరిన్ని యుద్ధ నేరాలకు పాల్పడుతున్నాడు. అమాయక పౌరులను హత్య చేస్తున్నాడు. ప్రపంచం మరింతగా ఒత్తిడిని పెంచి.. రష్యాను ఒంటరిగా చేయండి’ అని పేర్కొన్నారు.
మరోవైపు.. ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో భారతీయులు బిక్కుబిక్కుమంటున్నారు. తరలింపు ప్రక్రియ వేగవంతమవుతున్నా పరిస్ధితి దారుణంగా వుండటంతో ఉక్రెయిన్‌లోని భారతీయ విద్యార్ధులు (indian students) ఆందోళనకు గురవుతున్నారు. దీనికి తోడు ఉక్రెయిన్ - పోలాండ్ సరిహద్దుల్లో భారతీయ విద్యార్ధులపై పోలీసుల దురుసు ప్రవర్తన, లాఠీచార్జీ వంటివి భారత ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. వీటిని తీవ్రంగా పరిగణించిన కేంద్రం.. తరలింపు ప్రక్రియను పరుగులు పెట్టించాలని చూస్తోంది.
ఈ ప్రక్రియ జరుగుతుండగానే ఓ దారుణం జరిగింది. రష్యా దాడుల్లో భారతీయ విద్యార్ధి మృతిచెందాడు. ఈ ఉదయం ఖార్కీవ్‌లో జరిపిన దాడుల్లో భారత విద్యార్థి ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్ బాగ్చీ ట్విటర్‌లో అధికారికంగా ధ్రువీకరించారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. నవీన్ స్వస్థలం కర్ణాటక రాష్ట్రం హవేరి. అతను ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్నట్లు విదేశాంగ శాఖ పేర్కొంది.
మరోవైపు... ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో (kyiv) ఉన్న భారతీయ పౌరుల్ని ఉద్దేశించి మంగళవారం కేంద్రం అత్యవసర ప్రకటన చేసింది. తక్షణమే కీవ్ నగరాన్ని వీడాలని అడ్వైజరీ జారీ చేసింది. అందుబాటులో ఉన్న రవాణా మార్గాల ద్వారా అక్కడి నుంచి బయటపడాలని సూచనలు చేసింది. ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతం వైపునకు చేరుకునేందుకు కీవ్‌లో రైళ్లు సిద్ధంగా ఉన్నాయని నిన్న ఇండియన్ ఎంబసీ సమాచారం ఇచ్చిన సంగతి తెలిసిందే. రైల్వే స్టేషన్ల వద్దకు భారీగా తరలి రావొచ్చునని.. అయితే భారతీయ పౌరులంతా సంయమనంతో వ్యవహరించాలని పేర్కొంది. దేశం వీడేందుకు తగిన పత్రాలు, నగదు వెంట ఉంచుకోవాలని ఇండియన్ ఎంబసీ (indian embassy in ukraine) సూచించింది.