కాబూల్ నుంచి హెలికాప్టర్ నిండా డబ్బు తీసుకెళ్లారు: అష్రఫ్ ఘనీపై రష్యా అధికారి

By telugu teamFirst Published Aug 18, 2021, 4:24 PM IST
Highlights

ఆఫ్ఘనిస్తాన్ తాజా మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశాన్ని వదిలివెళ్లేటప్పుడు తన వెంట భారీగా సొమ్మును తీసుకెళ్లాడని కాబూల్‌లోని రష్యా ఎంబసీ ప్రతినిధి నికితా ఆరోపించారు. డబ్బుతో నిండిన నాలుగు కార్లను హెలికాప్టర్‌లో ఉంచి, ఖాళీ ప్రదేశంలోనూ మరికొంత నగదును పరిచి తీసుకెళ్లినట్టు ప్రత్యక్ష సాక్షులు తనకు చెప్పారని వివరించారు.
 

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌ను తాలిబాన్లు ఆక్రమించుకోగానే దేశం వదిలివెళ్లిన అప్పటి అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ వట్టి చేతులతో వెళ్లలేదని, తనతోపాటు భారీగా సొమ్ము తీసుకెళ్లాడని తెలిసింది. నాలుగు కార్ల నిండా డబ్బు కుక్కి వాటిని హెలికాప్టర్‌లో తీసుకెళ్లారని కాబూల్‌లోని రష్యా ఎంబసీ ప్రతినిధి నికితా ఇష్చెంకో అన్నారు. ఆ హెలికాప్టర్‌లోని ఖాళీ ప్రదేశంలోనూ డబ్బును కుక్కే ప్రయత్నం చేశారని, కానీ, ఆ డబ్బు ఇంకా మిగిలిందని తెలిపారు. మిగిలిన ఆ డబ్బును అక్కడే నేలపై వదిలిపెట్టి వెళ్లినట్టు ప్రత్యక్ష సాక్షులు తనకు తెలిపారని చెప్పారు.

ఆఫ్ఘనిస్తాన్ నుంచి హెలికాప్టర్‌లో వెళ్లిన ఘనీని తజకిస్తాన్ ప్రభుత్వం స్వీకరించలేదు. ఘనీ హెలికాప్టర్‌ ల్యాండింగ్‌కు అనుమతినివ్వలేదు. దీంతో ఒమన్‌కు వెళ్లినట్టు తెలిసింది. అక్కడి నుంచి అమెరికాకు వెళ్లే అవకాశాలున్నట్టు సమాచారం.

కాగా, అష్రఫ్ ఘనీ దేశాన్ని విడిచివెళుతూ భారీగా సొమ్మును వెంటబెట్టుకెళ్లారన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. రష్యా ప్రతినిధితోపాటు తాజాగా, తజకిస్తాన్‌లోని ఆఫ్ఘనిస్తాన్ ఎంబసీ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేసింది. అష్రఫ్ ఘనీ దేశ ఖజానాను కొల్లగొట్టారని, ఆయనను వెంటనే అరెస్టు చేయాలని ఇంటర్‌పోల్ పోలీసులు డిమాండ్ చేసింది. అష్రఫ్ ఘనీతోపాటు ఆయన వెంటే ఉన్న మాజీ జాతీయ భద్రతా సలహాదారు హమదుల్లా మోహిబ్, మాజీ ప్రధాన సలహాదారు ఫజేల్ మహమూద్‌లున్నారు. ఈ ముగ్గురూ ప్రజల సొమ్మును ఎత్తుకెళ్లారని, వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. అష్రఫ్ ఘనీ ఆ డబ్బును ఇంటర్నేషనల్ ట్రిబ్యూనల్‌కు అప్పజెప్పి దేశ ఖజానాను రీస్టోర్ చేయాలని తెలిపింది.

click me!