
న్యూఢిల్లీ: శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఆ దేశం స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి ఇంతటి సంక్షోభాన్ని చూడలేదు. చమురు సహా ఇతర అత్యవసర సరుకులనూ దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం దగ్గర విదేశీ మారకం లేదు. దీంతో ప్రజలు దిన దిన గండంగా బతుకుతున్నారు. పెట్రోల్, డీజిల్ కోసం బంక్‌ల ముందు వాహనాల్లో కిలోమీటర్ల మేర క్యూలో ఉంటున్నారు. కొందరైతే.. ఈ క్యూలో నిలిపిన వాహనాల్లోనే మరణిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ప్రజలు శ్రీలంక ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. ఇది వరకే హింసాత్మక ఆందోళనలు జరిగిన సంగతి తెలిసిందే. అప్పుడు ప్రధానిగా మహింద రాజపక్స రాజీనామా కూడా చేశారు. తాజాగా, మరోసారి ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనకారులు రాజధాని నగరానికి పోటెత్తారు.
వేలాది సంఖ్యలో ప్రజలు అధ్యక్షుడు అధికారిక నివాసం వైపుగా బయల్దేరారు. అధ్యక్షుడిగా గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ఆందోళనతో అధికారిక నివాసం చేరుకున్నారు. ఈ ఆందోళనల నేపథ్యంలోనే అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అధికారిక నివాసం నుంచి పారిపోయాడు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడనేది ఇంకా తెలియదు. ఈ నేపథ్యంలోనే ఓ కీలక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
అధ్యక్షుడు గొటబాయ రాజపక్స పారిపోయిన నేపథ్యంలోనే ఆయనకు సంబంధించిన సూట్‌కేసులు నేవీ షిప్‌లో వేగంగా లోడ్ చేస్తున్న వీడియో బయటకు వచ్చింది. ఎస్ఎల్ఎన్ఎష్ గజబాహు నేవీ షిప్‌లో ముగ్గురు వ్యక్తులు పెద్ద పెద్ద సూట్‌కేసులను తీసుకెళ్లుతున్నట్టుగా ఆ వీడియో తెలుపుతున్నది. ఆ ముగ్గురు సూట్‌కేసులను వేగంగా ఆత్రంగా పట్టుకుని లాగుతూ పరుగెడుతున్నారు. ఈ సూట్‌కేసులు అధ్యక్షుడు గొటబాయ రాజపక్సేవేనని స్థానిక మీడియా పేర్కొంది.
ఆ హార్బర్ మాస్టర్ న్యూస్ వన్ చానెల్‌తో మాట్లాడుతూ, ఓ గ్రూప్ ఎస్ఎల్ఎన్ఎస్ సిందూరల, ఎస్ఎల్ఎన్ఎస్ గజబాహులో వెళ్లిపోయిందని వివరించారు. అయితే, ఆ షిప్‌లలో ఎవరు వెళ్లారన్న వివరాలను తాను చెప్పరాదని పేర్కొన్నారు.
నిన్ననే అధ్యక్షుడు గొటబాయ రాజపక్సను ఆర్మీ హెడ్ క్వార్టర్‌కు తరలించినట్టు కొన్ని వర్గాలు ఎన్డీటీవీ మీడియా సంస్థకు తెలిపినట్టు ఓ కథనం పేర్కొంది.
అలాగే, అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు చెందిన కారుల కాన్వాయ్ ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లినట్టుగా కొన్ని ప్రైవేటు బ్రాడ్‌కాస్టర్లు చూపించాయి. అయితే, ఆయన నిజంగానే ఈ దీవి దేశాన్ని వదిలి వెళ్లారా? లేదా? అనే విషయంపై క్లారిటీ లేదు. ప్రస్తుతానికి ఆయన ఎక్కడ ఉన్నారనే విషయంపై స్పష్టత లేదు. కానీ, ఆందోళనకారులు మాత్రం ఆయన కార్యాలయం, ఆయన అధికారిక నివాసాన్ని చుట్టుముట్టేశారు.
కొందరైతే అధ్యక్ష భవనంలోని స్విమ్మింగ్ పూల్స్‌లో దూకుతూ ఈత కొడుతున్నట్టుగానూ వీడియోలో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
ఈ ఆందోళనల్లో ఇద్దరు పోలీసులు సహా 30 మందికి గాయాలయ్యాయి.