
న్యూఢిల్లీ: షింజో అబే హత్య జరిగిన తర్వాతి రోజే సింగపూర్ పీఎం లీ హెసిన్ లూంగ్‌కు బెదిరింపులు వచ్చాయి. సింగపూర్ ప్రధాని హెసిన్ లూంగ్‌ను కించపరుస్తూ 45 ఏళ్ల ఓ వ్యక్తి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. షింజో అబే మరణం గురించి న్యూస్ ఏసియా అనే వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌లో చేసిన పోస్టుకు స్పందనగా ఈ బెదిరింపు వచ్చింది. ఈ ఫేస్‌బుక్ పోస్టు కామెంట్ సెక్షన్‌లో ఈ వ్యక్తి ప్రస్తుత సింగపూర్ ప్రధాని లీ హెసిన్ లూంగ్‌పై బెదిరింపులకు పాల్పడుతూ కామెంట్ చేశారు. ఈ బెదిరింపులకు సంబంధించి శుక్రవారం మధ్యాహ్నం 3.10 గంటల సమయంలో తమకు ఫిర్యాదు వచ్చిందని పోలీసులు వెల్లడించారు.
ఈ కేసు విచారణ చేపట్టిన పోలీసులు ఆ యూజర్‌ను గుర్తించారు. ఆ ఫేస్‌బుక్ యూజర్‌ను తమ అదుపులోకి తీసుకున్నామని, ఆయనతోపాటు నాలుగు మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్‌ను సీజ్ చేసినట్టు వివరించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతున్నట్టు చెప్పారు.
హింసను ప్రేరేపించే ఎలక్ట్రానిక్ రికార్డును తయారు చేసినా.. పంపిణీ చేసినా తమ దేశాల చట్టాల ప్రకారం ఐదేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా? లేదా రెండూ విధించే అవకాశాలు ఉన్నాయని ఓ పత్రిక తెలిపింది.
సింగపూర్ ప్రధాని లీ శుక్రవారం మాట్లాడుతూ, షింజో అబే మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. షింజో అబే సింగపూర్‌కు మంచి ఫ్రెండ్ అని వివరించారు. షింజో అబే టోక్యో పర్యటించినప్పుడు మే నెలలో తాను లంచ్ నిర్వహించానని తెలిపారు. షింజో అబే, ఆయన కుటుంబ సభ్యుల కోసం ప్రార్థనలు చేస్తున్నట్టు వివరించారు.