
న్యూఢిల్లీ: చైనా ఆర్థిక నగరంగా పేర్కొనే షాంఘైలో ఓ ప్రముఖ హాస్పిటల్‌లో దుర్ఘటన చోటుచేసుకుంది. ఓ దుండగుడు కత్తితో వీరంగం చేశాడు. కొంత మందిని నిర్బంధించి కత్తితో బెదిరింపులకు పాల్పడ్డాడు. పోలీసులు వచ్చినప్పటికీ కత్తితో వారిని పొడిచి చంపుతానని బెదిరించాడు. అయితే, పోలీసులు సకాలంలో తగిన చర్యలు తీసుకోవడంతో వారు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఆ దుండగుడు కొందరిని కత్తితో పొడవడం మొదలు పెట్టాడు. అయితే, పోలీసులు వెంటనే ఫైర్ చేశారు. అనంతరం ఆ దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు.
హాస్పిటల్‌లోని ఏడో ఫ్లోర్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కొంత మందిని కత్తితో పొడవడంతో హాస్పిటల్ మొత్తం బెంబేలెత్తిపోయింది. డాక్టర్లు సహా పేషెంట్ అటెండంట్లు, కొందరు పేషెంట్లు కూడా పరుగు లంకించుకున్నారు. టేబుళ్లు, ఇతర ఎక్విప్‌మెంట్ కింద నుంచి నక్కుతూ పారిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.
ఈ ఘటన షాక్‌కు గురి చేసిందని హెల్త్ చెక్ అప్ కోసం వచ్చిన వ్యక్తి వివరించారు. ఇది చాలా బాధగా ఉన్నదని, అసలు ఈ సొసైటీకి ఏమైందని ఆవేదన చెందారు.
ఆ దుండుగుడి కత్తిపోట్లకు గురైన బాధితులకు ప్రాణ హానీ ఏమీ లేదని వైద్యులు తెలిపారు. నలుగురికి ఈ గాయాలు అయినట్టు వివరించారు. ఆ హాస్పిటల్ మొత్తం కార్డన్ ఆఫ్ చేసినట్టు పేర్కొన్నారు. అన్ని అపాయింట్‌మెంట్లను రద్దు చేసినట్టు చెప్పారు.
ఇలాంటి ఘటనే ఇటీవలే ఇదే హాస్పిటల్‌లో చోటుచేసుకుంది. జింగాన్ జిల్లాలోనూ ఓ వ్యక్తి కత్తితో సాధారణ ప్రజలను పొడిచేయడానికి ప్రయత్నించాడు. పోలీసులు వెంటనే ఆ దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది.