
Russia Ukraine war: ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ గురువారం ఉక్రెయిన్‌లో పర్యటించారు. రాజధాని కీవ్ లో పలు ప్రాంతాలను సందర్శించారు. కీవ్‌కు సమీపంలోని బొరొడియాంకా పట్టణాన్ని కూడా ఆయన సందర్శించారు. గత రెండు నెలలుగా రష్యా జరిపిన వైమానిక దాడులు వల్ల ఆ ప్రాంతంలో భారీ నష్టం జరిగిందని, అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని, ఆ పరిస్థితులను చూసి గుటెర్రస్ చలించిపోయారు.
21వ శతాబ్ధంలో యుద్ధం ఓ మూర్ఖత్వ చర్య అని, యుద్ధం ఓ దుష్ట చర్య, ఇలాంటి భయానక పరిస్థితుల్ని గమనిస్తుంటే.. చాలా దారుణంగా, హృదయ విదారకంగా ఉందనీ అన్నారు. బాధితులకు నివాళి అర్పిస్తున్నానని, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ 21వ శతాబ్ధంలో యుద్ధం మాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. బుచాలో ఓ చర్చి వద్ద జరిగిన సామూహిక హత్యలు ప్రదేశాన్ని గుటెర్రస్ సందర్శించారు. ఇలాంటి హృదయ విదారక ఘటనలపై సమగ్ర విచారణ అవసరమని, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు విచారణకు రష్యా సహకరించాలని యూఎన్ చీఫ్ తెలిపారు.
ఇదిలా ఉంటే.. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఉక్రెయిన్ పర్యటన సందర్భంగా రాజధాని కైవ్ సమీపంలో రష్యా బాంబు దాడి చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ దాడిలో మృతుల సమాచారం అధికారికంగా వెల్లడి కానప్పటికీ, UN సెక్రటరీ జనరల్ సురక్షితంగా ఉన్నట్లు సమాచారం.
కైవ్ మేయర్ విటాలీ క్లిట్ష్కో టెలిగ్రామ్‌లో ఒక పోస్ట్‌లో.. షెవ్చెంకోవ్స్కీ జిల్లాలో రెండు సార్లు బాంబు దాడులు జరిగినట్టు పేర్కొన్నారు. మృతుల వివరాలపై స్పష్టత ఇస్తున్నామని చెప్పారు. AFP ప్రకారం.. ఆకాశంలో నల్లటి పొగ కనిపిస్తోందనీ, ఓ భవనం మంటల్లో చిక్కుకుందనీ, ఆ ప్రాంతంలో పోలీసులు, రెస్క్యూ బృందాలు పెద్ద సంఖ్యలో ఉన్నట్టు పేర్కొంది.
"@antonioguterres అధికారిక పర్యటన సందర్భంగా కైవ్ నగర సమీపంలో వైమానిక దాడి జరిగిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ సీనియర్ సహాయకుడు మైఖైలో పోడోలిక్ ట్వీట్ చేశారు. సుదీర్ఘ చర్చల తర్వాత గుటెర్రెస్ ముందురోజు క్రెమ్లిన్‌కు వస్తున్నాడని, పేలుడు పదార్థాలు ఉన్నాయని మైఖైలో చెప్పాడు. కాగా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్, అధ్యక్షుడు పుతిన్‌లు సమావేశమై పలు కీలక విషయాలపై మాట్లాడారు.