ఎలిజబెత్ మరణం.. మా డైమండ్ మాకు ఇచ్చేయండి: దక్షిణాఫ్రికా డిమాండ్

By Mahesh KFirst Published Sep 19, 2022, 4:56 PM IST
Highlights

బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ మరణం తర్వాత పలు దేశాలు తమకు చెందిన డైమండ్ వెంటనే తిరిగిచ్చేయాలని డిమాండ్ చేశాయి. భారత ప్రజలు కూడా కోహినూర్ డైమండ్ తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. తాజాగా, ఈ జాబితాలోకి దక్షిణాఫ్రికా కూడా చేరింది.

న్యూఢిల్లీ: బ్రిటన్ మహారాణి మరణించడంతో ఆమె కిరీటం, ఇతర నగల్లో పొదిగిన తమ వజ్రాలు తిరిగి తమకు ఇచ్చేయాలని పలు దేశాల నుంచి డిమాండ్లు వెలువడుతున్నాయి. క్వీన్ ఎలిజబెత్ మరణించిన తర్వాత ఆమె కిరీటంలో చేర్చిన తమ కొహినూర్ వజ్రం ఇచ్చేయాలని పలువురు సోషల్ మీడియాలో డిమాండ్ చేశారు. భారత్ నుంచి ఈ డిమాండ్లు ఎక్కువగా వినిపించాయి. సుమారు రెండు రోజులు ఇదే టాపిక్ ట్విట్టర్‌లో ట్రెండ్ అయింది. ఈ దేశాల జాబితాలోకి దక్షిణాఫ్రికా కూడా చేరింది. ఆఫ్రికా గోల్డ్ స్టార్ తిరిగి ఇచ్చేయాలని ఆ దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మనకు తెలిసిన అతిపెద్ద క్లియర్ కట్ డైమండ్ ఇదే కావడం గమనార్హం. ఈ డైమండ్‌నే కలినన్ I అని కూడా పిలుస్తారు. 530.2 క్యారెట్ల ఈ డైమండ్ బిందువు ఆకారంలో ఉంది. దీన్ని 1905లో దక్షిణాఫ్రికాలోని వలసవాద పాలకులు బ్రిటన్ రాజ కుటుంబానికి అందించారు. ఈ డైమండ్‌ను బ్రిటన్ రాజ వంశీయుల రాజదండంలో అమర్చారు. రాణికి చెందిన రాజదండంలో దీన్ని పొదిగారు. 

ఈ కలినన్ డైమండ్‌ను వెంటనే దక్షిణాఫ్రికాకు పంపించాలని యాక్టివిస్టు థాండుక్సోలో సాబెలో స్థానిక మీడియాతో మాట్లాడుతూ డిమాండ్ చేశాడు.  తమ దేశ, ఇతర దేశాల ఖనిజాలు ప్రజల ప్రయోజనాలు పణంగా పెట్టి బ్రిటన్ లబ్ది పొందిందని ఆరోపించాడు. బ్రిటన్ చేసిన తప్పిదాలు అన్నింటినీ ఇప్పుడు సరి చేయాలని దక్షిణాఫ్రికా పార్లమెంట్ సభ్యుడు వుయోల్వెతు జుంగులా ట్వీట్ చేశారు. బ్రిటన్ దొంగిలించిన బంగారం, వజ్రాలను వెంటనే ఇచ్చేయాలని డిమాండ్ చేశారు.

ఈ డైమండ్‌ను లండన్‌ టవర్ సమీపంలోని జువెల్ హౌజ్‌లో బహిరంగ ప్రదర్శనకు ఉంచినట్టు ఏబీసీ న్యూస్ సంస్థ వెల్లడించింది. అయితే, ఈ డైమండ్ యొక్క కచ్చితమైన విలువ తెలియదు. కానీ, అరుదైన, చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఈ డైమండ్‌కు పెద్ద మొత్తంలో ధర పలుకవచ్చు.

క్వీన్ ఎలిజబెత్ మరణం తర్వాత చాలా దేశాల ప్రజలు వారికి చెందిన వజ్రాలను తిరిగి ఇచ్చేయాలని సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే.

click me!