హిజాబ్‌ల దహనం.. జుట్టు కత్తిరించుకుంటున్న ఇరాన్ మహిళలు.. ఎందుకో తెలుసా?

By Mahesh KFirst Published Sep 19, 2022, 2:03 PM IST
Highlights

ఇరాన్‌లో మహిళలు ఉగ్రరూపం దాల్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరుబాట పట్టారు. హిజాబ్ పాటించాలని ఆ దేశం ఇచ్చిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ హిజాబ్‌లు బహిరంగంగా తొలగిస్తున్నారు. జుట్టు కత్తిరించుకుని వినూత్న నిరసనలు చేస్తున్నారు.

న్యూఢిల్లీ: ఇరాన్‌లో మహిళలు శివాలెత్తుతున్నారు. పాలకుల అణచివేత దోరణితో విసిగి వేసారిపోయారు. హిజాబ్ ధరించడం తప్పనిసరి చేయడాన్ని వారు నిరసిస్తున్నారు. తమ హక్కులను కాలరాస్తున్నారని మండిపడుతున్నారు. తమ స్వేచ్ఛను హరించవద్దని చెబుతున్నారు. వారి నిరసనలు హరిస్తున్న ప్రభుత్వాన్ని నిరసిస్తూ.. నియంత చావాలి అంటూ తీవ్ర నినాదాలు చేస్తున్నారు.

22 ఏళ్ల ఇరాన్ మహిళ మహ్సా అమిని మరణంతో ఒక్కసారిగా ఇరాన్ వనితలు ఆందోళన బాటపట్టారు. రోడ్డు ఎక్కి నిరసనలు చేస్తున్నారు. వారి నిరసనలు సరికొత్త రూపాల్లో వెల్లడిస్తున్నారు. తమ హిజాబ్‌లు తొలగించి వాటిని కాల్చి వేస్తున్నారు. వెంట్రుకలను కత్తిరించేస్తున్నారు. ఇవి ప్రత్యక్షంగా చేయడమే కాదు.. వాటిని రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.

ఇరాన్ ప్రభుత్వ తిరోగమన, అణచివేత చట్టాలకు వ్యతిరేకంగా మహిళలు స్వేచ్ఛను కోరుతూ పోరాటం చేయాలని హక్కుల కార్యకర్తలు పిలుపు ఇస్తున్నారు. ఇందులో భాగంగానే 22 ఏళ్ల మహ్సా అమిని బహిరంగంగా హిజాబ్‌ను తొలగించింది. దీన్ని పోలీసులు సహించలేదు. మోరల్ పోలీసులు వెంటనే ఆమెను అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఆమెను వ్యాన్‌లోకి ఎక్కించుకోగానే దాడి చేయడం మొదలు పెట్టారని కొందరు సాక్షులు చెప్పినట్టు కథనాలు వచ్చాయి. కాగా, శుక్రవారం ఆమె పోలీసులు కస్టడీలోనే మరణించారు. ఆమె గుండెపోటుతో మరణించారని అధికారులు చెబుతుండగా.. ఆ వాదనలను బాధితురాలి కుటుంబ సభ్యులు ఖండించారు.

మహ్సా అమిన్ అంత్యక్రియలు నిన్న సాకెజ్‌లో జరిగాయి. ఆమె అంత్యక్రియల్లో మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. ర్యాలీగా వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేశారు. ఈ సందర్భంగా సులేమనీ బ్యానర్ కూడా చింపేశారు. వారిని అణచివేయడానికి పోలీసులు బలగాలు టియర్ గ్యాస్ సైతం ప్రయోగించాయి. టెహ్రాన్ యూనివర్సిటీ దగ్గర కొందరు మహిళలు వుమన్, లైఫ్, ఫ్రీడమ్ అంటూ నినాదాలు ఇచ్చారు. చాలా మంది మహిళలు తమ హిజాబ్‌లు తొలగించారు. కొందరైతే.. నియంత చావాలని నినాదాలు ఇచ్చారు. చాలా మంది మహిళలు తమ తల వెంట్రుకలు కట్ చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పెట్టారు.

ఇరాన్ ప్రభుత్వం షరియా చట్టం ప్రకారం, ఏడు సంవత్సరాల నుంచే తమ తల వెంట్రుకలను కవర్ చేయాలని ఆదేశిస్తున్నది. మహిళలు వదులుగా ఉండే పొడవైన దుస్తులు మాత్రమే ధరించాలని చెబుతున్నది. హిజాబ్ తప్పనిసరిగా చేసింది. మహిళలు ఎలా డ్రెస్ చేసుకోవాలని హిజాబ్ చట్టంతో ఆదేశం ఇచ్చినట్టయింది. 

click me!