ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భకంపం.. 920 మంది మృతి, 600 మందికి గాయాలు.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం

By Sumanth KanukulaFirst Published Jun 22, 2022, 4:23 PM IST
Highlights

ఆఫ్ఘనిస్తాన్‌లో సంభవించిన శక్తివంతమైన భూకంపం.. భారీగా ప్రాణ, ఆస్తి నష్టాన్ని చేకూర్చింది. బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లోని గ్రామీణ, పర్వత ప్రాంతంలో ఈ భారీ భూకంపం సంభవించింది.

ఆఫ్ఘనిస్తాన్‌లో సంభవించిన శక్తివంతమైన భూకంపం.. భారీగా ప్రాణ, ఆస్తి నష్టాన్ని చేకూర్చింది. బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లోని గ్రామీణ, పర్వత ప్రాంతంలో ఈ భారీ భూకంపం సంభవించింది. భూకంపం వల్ల కనీసం 900 మంది మరణించారని.. 600 మందికి పైగా గాయపడ్డారని తాలిబన్ అధికారులు చెబుతున్నారు. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు చెబుతున్నారు. రిక్టర్ స్కేల్‌పై 6.1 తీవ్రతతో సంభవించిన భూకంపం దాటికి.. ఖోస్ట్, పక్తికా ప్రావిన్సులలోని భవనాలు, ఇళ్లు ధ్వంసం అయ్యాయి. 

భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్‌లోని పక్తికా ప్రావిన్స్‌లో సరిహద్దుకు సమీపంలో ఉందని, ఖోస్ట్ నగరానికి నైరుతి దిశలో 50 కిలోమీటర్లు (31 మైళ్లు) దూరంలో ఉందని పొరుగు దేశమైన పాకిస్తాన్ వాతావరణ విభాగం తెలిపింది. భూకంపం సంభవించిన ప్రాంతాల్లోని మెజారిటీ ఇళ్లు అస్థిరంగా, పేలవంగా నిర్మించబడటంతో నష్టం ఎక్కువ ఉందని మీడియా నివేదికలు సూచిస్తున్నాయి.

గతేడాది ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబాన్ స్వాధీనం చేసుకున్న తర్వాత.. అనేక అంతర్జాతీయ సహాయ సంస్థలు ఆ దేశాన్ని విడిచిపెట్టి వెళ్లాయి. దీంతో రెస్క్యూ ప్రయత్నాలు క్లిష్టంగా మారే అవకాశం ఉంది. మరోవైపు భూకంపం సంభవించింది మారుమూల ప్రాంతాలు కావడంతో.. సహాయక చర్యలు చేపట్టేందుకు రెస్క్యూ సిబ్బంది హెలికాఫ్టర్లలో అక్కడికి చేరుకుంటున్నారు. గాయపడిన వారిని హెలికాఫ్టర్‌లలో అక్కడి నుంచి తరలిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. 

ఈ ఘటనపై స్పందించిన తాలిబాన్ ప్రభుత్వ డిప్యూటీ అధికార ప్రతినిధి బిలాల్ కరీమీ ఎంతమంది మరణించారనే వివరాలను మాత్రం తెలుపలేదు. అయితే పాక్టికాలోని నాలుగు జిల్లాలను వణికించిన భూకంపంలో వందలాది మంది మరణించారని చెప్పారు. ‘‘మరింత విపత్తును నివారించడానికి వెంటనే ఆ ప్రాంతానికి బృందాలను పంపాలని మేము అన్ని సహాయ ఏజెన్సీలను కోరుతున్నాము’’ అని ట్వీట్ చేశారు. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్‌లో చోటుచేసుకున్న భూకంపం కారణంగా వందలాది మంది మరణించడంపై పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. తమ దేశం ఆఫ్ఘన్ ప్రజలకు సహాయం చేస్తుందని చెప్పారు. 

click me!