ఇండియాను కౌంటర్ చేయడానికే పాక్ తాలిబాన్‌కు జన్మనిచ్చింది: అఫ్ఘాన్ మాజీ దౌత్య అధికారి

By telugu teamFirst Published Aug 29, 2021, 1:46 PM IST
Highlights

తాలిబాన్లకు పాకిస్తాన్ సహకారాన్ని స్పష్టం చేస్తూ దాని వైఖరిని ఎండగడుతూ ఆఫ్ఘనిస్తాన్ మాజీ దౌత్య అధికారి మహ్మద్ సైకాల్ కీలక విషయాలు వెల్లడించారు. ఇండియాను కౌంటర్ చేయడానికి పాకిస్తాన్ తాలిబాన్‌కు జన్మనిచ్చినట్టు పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. ఆఫ్ఘనిస్తాన్‌లో అడుగుపెట్టిన ఉగ్రవాదులందరూ పాకిస్తాన్ గుండానే చేరారని తెలిపారు.
 

ఇస్లామాబాద్: భారత్ లక్ష్యంగానే పాకిస్తాన్ తాలిబాన్‌ను పెంచిపోషించిందని ఆఫ్ఘనిస్తాన్ మాజీ దౌత్య అధికారి
మహ్మద్ సైకాల్ ఆరోపించారు. పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఆయన
ట్వీట్ చేశారు. పర్వేజ్ ముషార్రఫ్ పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు. పర్వేజ్ ముషార్రఫ్ ప్రకారం, భారత్‌ను కౌంటర్
చేయడానికి పాకిస్తాన్ తాలిబాన్‌కు జన్మనిచ్చిందని తెలిపారు.

ముషార్రఫ్‌తోపాటు మరికొందరు పాకిస్తాన్ ప్రముఖులను తాలిబాన్ కోణంలో వ్యాఖ్యానించారు. వారు ఆయా సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ సైకాల్ ట్వీట్ చేశారు. తాలిబాన్లపై పాకిస్తాన్ వైఖరిని బట్టబయలు చేశారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రకారం, తాలిబాన్లు బానిస సంకెళ్లను తెంచారని పేర్కొన్నారు. 

ఇటీవలే ఇమ్రాన్ ఖాన్ తాలిబాన్ల గురించి సానుకూల దృక్పథంతో మాట్లాడారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలను పాశ్చాత దేశాల బానిస సంకెళ్ల నుంచి తాలిబాన్లు విముక్తి కల్పించారని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. సాంస్కృతిక బానిసత్వం నుంచి ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు విముక్తి ప్రసాదించారని పేర్కొన్నారు.

ఇప్పుడు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఎస్ఎం ఖురేషీ, స్కాలర్ యూసుఫ్ మొయీద్‌లు తాలిబాన్లతో అనుసంధానించడానికి ప్రపంచదేశాలతో లాబీయింగ్ చేయడంలో బిజీ అయ్యారని సైకాల్ ట్వీట్ చేశారు. దేశ విదేశాల నుంచి ఐఎస్ఐఎల్-కే ఉగ్రవాదులు, అల్ ఖైదా తీవ్రవాదులు అందరూ పాకిస్తాన్ గుండానే ఆఫ్ఘనిస్తాన్ చేరారని స్పష్టం చేశారు. ఇప్పటికీ కొందరు తాలిబాన్లు పాకిస్తాన్‌లోనే ఉన్నారని తెలిపారు. కాబూల్‌ను తాలిబాన్లు స్వాధీనంలోకి తెచ్చుకున్న తర్వాత తీవ్రవాదులు, అతివాదులు, టెర్రరిస్టు గ్రూపులు ఆఫ్ఘనిస్తాన్‌లోకి ప్రవేశిస్తున్నాయని వివరించారు. పాకిస్తాన్ చర్యలతో ఆఫ్ఘనిస్తాన్ త్వరలో టెర్రర్ హబ్‌గా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి పాకిస్తాన్‌పై కఠిన ఆంక్షలతో కూడిన సంబంధాలతోనే ఆఫ్ఘనిస్తాన్‌లో సానుకూల, శాంతి వాతావరణాన్ని చూడటానికి వీలుపడుతుందని తెలిపారు. అంతర్జాతీయంగా శాంతి భద్రతల కోసం ఇది అవసరమని అభిప్రాయపడ్డారు.

click me!