
న్యూఢిల్లీ: ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ మిలిటరీ సామర్థ్యాలను తగ్గించడమే తమ లక్ష్యమని పేర్కొంటూ కేవలం ఆ దేశ మిలిటరీ స్థావరాలను మాత్రమే లక్ష్యం చేసుకుంటామని ప్రకటించింది. కానీ, వాస్తవంలో ఇందుకు విరుద్ధ ఘటనలు జరుగుతున్నాయి. రష్యా దాడుల్లో చాలా మంది అమాయకులు మరణిస్తున్నారు. ఉక్రెయిన్ పౌరులు సహా విదేశీయులూ మరణించారు. అంతేకాదు, మిలిటరీ స్థావరాలపై దాడులు చేయడమే కాకుండా, పౌరులు తలదాచుకున్న ఒక డ్రామా థియేటర్‌పైనా రష్యా బాంబులతో విరుచుకుపడింది. గతవారం మరియుపోల్‌లోని ఓ డ్రామా థియేటర్‌పై దాడి చేసింది. ఈ దాడిలో సుమారు 300 మంది దుర్మరణం చెంది ఉండొచ్చని తాజాగా వార్తా కథనాలు వచ్చాయి.
ఉక్రెయిన్ దేశంలోని పోర్టు నగరం మరియుపోల్‌లో ఓ డ్రామా థియేటర్‌లో పౌరులు తలదాచుకున్నారు. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా సుమారు వేయి మంది ఈ థియేటర్‌లో తలదాచుకున్నారు. కానీ, గతవారం అంటే మార్చి 16న రష్యా వైమానిక సేనలు శక్తిమంతమైన బాంబును ఈ డ్రామా థియేటర్‌పై విడిచారు. దీంతో ఆ డ్రామా థియేటర్ ధ్వంసమైంది. ఈ దాడిలో సుమారు 300 మంది మరణించినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ థియేటర్‌లో 300 మంది వరకు మరణించినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారని మరియుపోల్ సిటీ హాల్ టెలిగ్రామ్‌లో రాసింది.
రష్యా చేస్తున్న దాడులతో మరియుపోల్‌లో పౌరులు పెద్ద సంఖ్యలో మరణిస్తున్నారు. మృతుల అంత్యక్రియలు చేయడానికి ఆప్తులు జంకుతున్నారు. ఎందుకుంటే రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అంతిమ సంస్కారాలు నిర్వహించుకునే అవకాశమూ ఉండటం లేదు. దీంతో చాలా మంది తమ ఆప్తుల మృతదేహాలను సామూహికంగా ఖననం చేస్తున్నారు. ఈ చిత్రాలు సోషల్ మీడియాలో గుండెలు పిండుతున్నాయి.
ఉక్రెయిన్‌లో పోర్టు నగరమైన మరియుపోల్ కీలక భౌగోళిక ప్రాంతంగా ఉన్నది. ప్రస్తుతం ఈ నగరానికి ఉక్రెయిన్ దేశంతో దాదాపు సంబంధాలు తెగిపోయినట్టు తెలిసింది. ఈ నగర ప్రజలకు అవసరమైన వనరులూ నిండుకున్నాయి. దీంతో దినదిన గండంగా గడపాల్సిన దుస్థితిలో మరియుపోల్ ప్రజలు ఉన్నారు.
ఉక్రెయిన్‌లో ప్రాణ నష్టం గురించి ఐరాస స్పందించింది. నెల రోజులుగా జరుగుతున్నఈ యుద్దంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్యసమితి (United Nations) కీలక ప్రకటన చేసింది. రష్యా దాడుల కారణంగా ఉక్రెయిన్‌లో ఇప్పటివరకు 1035 మంది సామాన్య పౌరులు మృతి చెందినట్లు ఐక్యరాజ్యసమితి గురువారం వెల్లడించింది. ఇందులో 90 మంది చిన్నారులు ఉన్నారని తెలిపింది. ఈ యుద్ధంలో మరో 1650 మంది గాయపడ్డరాని వెల్లడించారు.
మరియుపోల్, కీవ్ తదితర నగరాల నుంచి ఇంకా పూర్తిస్థాయి నివేదికలు రావాల్సి ఉందని పేర్కొంది. వీటి ప్రకారం.. మరణాల సంఖ్య భారీగానే ఉంటుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ఖర్కివ్ పరిపాలనా భవనం శిథిలాల నుంచి మరో 24 మృతదేహాలను బయటికి తీసినట్లు అధికారులు ప్రకటించారు. ట్రాస్టియనెట్స్ నగరంలో 2 రోజుల క్రితం భారీ అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతంలో ఇంకా మంటలు ఎగసిపడుతున్నట్లు అక్కడి గవర్నర్ తెలిపారు.