ఉగ్రస్థావరంగా పాకిస్థాన్ .. ఇప్పటివరకు 150 మంది ఉగ్రవాదులు, ఉగ్ర గ్రూపులను బ్లాక్‌లిస్ట్‌ చేసిన ఐక్యరాజ్యసమితి

By Rajesh KarampooriFirst Published Jan 18, 2023, 7:28 AM IST
Highlights

ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్‌కు అంతర్జాతీయ అవమానం. పాకిస్తాన్ తో సంబంధమున్న  150 ఉగ్రవాద సంస్థలు, వ్యక్తులను ఐక్యరాజ్యసమితి బ్లాక్ లిస్ట్ చేసింది.

ఒకవైపు ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న పాకిస్థాన్ కు అంతర్జాతీయ స్థాయిలో ఘోర పరాభవం ఎదురైంది.  ఒకరు కాదు.. ఇద్దర కాదు.. మొత్తం 150 మంది ఉగ్రవాదులు, పాకిస్థాన్‌తో సంబంధం ఉన్న ఉగ్రవాద సంస్థలను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చుతూ ఐక్యరాజ్య సమితి సంచలన నిర్ణయం తీసుకున్నది. ఈ బ్లాక్‌లిస్ట్‌లో పాకిస్థాన్‌తో సంబంధమున్న ఉగ్రవాదుల్లో ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్, జైషే మహ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజార్ , 1993 బాంబు పేలుళ్ల నిందితుడు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం లు ఉన్నారు.

ఇంతకుముందు.. ఐక్యరాజ్యసమితి పాకిస్తాన్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీని గ్లోబల్ టెర్రరిస్ట్ జాబితాలో చేర్చింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని 1267 ఐఎస్‌ఐఎల్ (దయిష్) , అల్ ఖైదా ఆంక్షల కమిటీ సోమవారం మక్కీని ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. మక్కీని ఈ జాబితాలో చేర్చిన వెంటనే.. అతని ఆస్తులను స్తంభింపజేసి, అతని అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధించింది. పాకిస్థాన్‌తో 150 ఉగ్రవాద సంస్థలకు సంబంధాలున్నాయని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. 

 
ఐక్యరాజ్య సమితి యొక్క గ్లోబల్ టెర్రరిస్ట్ జాబితా ప్రకారం.. దాదాపు 150 ఉగ్రవాద సంస్థలు, పాకిస్తాన్‌తో సంబంధాలు కలిగి ఉన్న లేదా పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాల నుండి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాదులను బ్లాక్ లిస్ట్ చేసింది. ఐక్యరాజ్య సమితిచే బ్లాక్ లిస్ట్ చేయబడిన పాకిస్తాన్ సంస్థలు లేదా ఉగ్రవాదులు. వీరిలో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా చీఫ్, ముంబై ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్ సయీద్, లష్కర్ టాప్ కమాండర్, 26/11 ముంబై దాడుల సూత్రధారి జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ, జైషే మహ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజార్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఉన్నారు.  

ఉగ్రవాదానికి కేంద్రంగా మారిన పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలను పెంచి పోషిస్తోందని గతేడాది ఐక్యరాజ్యసమితి ఉగ్రవాద నిరోధక కమిటీని ఉద్దేశించి భారత్ స్పష్టంగా చెప్పింది. 2008 ముంబై దాడులు, 2016 పఠాన్‌కోట్ దాడి , 2019 పుల్వామా ఉగ్రదాడి యొక్క భయానక సంఘటనలను ప్రపంచం చూసిందని ఐరాసలో భారత శాశ్వత మిషన్ కౌన్సెలర్ రాజేష్ పరిహార్ అన్నారు. ఉగ్రవాదులు ఎక్కడి నుంచి దాడులు చేస్తారో అందరికీ తెలిసిందే. పాకిస్థాన్‌ను ప్రస్తావిస్తూ.. ఈ దాడుల బాధితులకు ఇంకా న్యాయం జరగకపోవడం చాలా విచారకరమని అన్నారు. ఈ దాడులకు కుట్ర పన్నిన వారు, అమలు చేసిన వారు ఇప్పటికీ స్వేచ్ఛగా తిరుగుతూ వారికి అన్ని విధాలా సాయం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది భారత్.

 చైనా కుటిల బుద్ది

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌, అమెరికా చేస్తున్న ప్రయత్నాలపై చైనా గతేడాది నీళ్లు చల్లింది. మక్కీని గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించాలని భారత్, అమెరికా సంయుక్తంగా ప్రతిపాదన తెచ్చాయి. కానీ చైనా దానిని వీటో చేసింది. ఈ నిర్ణయం తీసుకున్న ఏడు నెలల్లోనే చైనా వైఖరిలో మార్పుకుంది. ఉగ్రవాదానికి పర్యాయపదంగా మారిన తన ప్రాణ స్నేహితుడు పాకిస్థాన్ ను కాపాడుకునేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తున్న చైనా ఇప్పుడు తీవ్రవాద నినాదాన్ని లేవనెత్తుతోంది. చైనా తన నిర్ణయాన్ని సమర్థిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ఉగ్రవాదుల జాబితాకు అనుకూలంగా ఉందని చైనా పేర్కొంది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు పాకిస్థాన్ చేస్తున్న ప్రయత్నాలను చైనా కూడా ప్రశంసించింది.

ఐక్యరాజ్యసమితి నిర్ణయాన్ని స్వాగతించిన భారత్

అంతకుముందు అబ్దుల్ రెహ్మాన్ మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాద జాబితాలో చేర్చేందుకు ఐరాస తీసుకున్న చర్యను భారత్ స్వాగతించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని 1267 ఐఎస్‌ఐఎల్ (దాష్), అల్ ఖైదా ఆంక్షల కమిటీ సోమవారం ప్రకటించిన టెర్రరిస్టుల జాబితాలో మక్కీని చేర్చిందని, దానిని తాము  స్వాగతిస్తున్నామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి  పేర్కొన్నారు. జమాత్ ఉద్ దవా చీఫ్, ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ బావ మక్కీ (68)ని ఐక్యరాజ్యసమితి గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించింది.

click me!