మేము గుణపాఠం నేర్చుకున్నాం.. కూర్చుని మాట్లాడుకుందామని మోదీకి పాక్ ప్రధాని సందేశం..

Published : Jan 17, 2023, 03:25 PM ISTUpdated : Jan 17, 2023, 04:00 PM IST
మేము గుణపాఠం నేర్చుకున్నాం.. కూర్చుని మాట్లాడుకుందామని మోదీకి పాక్ ప్రధాని సందేశం..

సారాంశం

పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము పొరుగుదేశం భారత్‌తో శాంతిని కోరుకుంటున్నట్టుగా చెప్పారు.

పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము పొరుగుదేశం భారత్‌తో శాంతిని కోరుకుంటున్నట్టుగా చెప్పారు. ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఆర్థిక సంక్షోభంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దీంతో పలు దేశాలను సాయం చేయాలని పాకిస్తాన్ కోరుతుంది. ఇలాంటి సమయంలో భారత్‌తో సంబంధాల గురించి పాక్ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్ చేసిన కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దుబాయ్‌కి చెందిన ఒక న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షెహబాజ్‌ షరీఫ్ మాట్లాడుతూ.. భారత్‌తో మూడు యుద్ధాల తర్వాత పాక్ గుణపాఠం నేర్చుకుందని, తాము శాంతిని కోరుకుంటున్నామని చెప్పారు. 

కశ్మీర్‌తో సహా ఇరు దేశాల మధ్య నెలకొన్న సమస్యలపై భారత ప్రధాని నరేంద్ర మోదీతో సీరియస్‌గా నిజాయితీతో చర్చలు జరపాలని పిలుపునిచ్చారు. అయితే కాశ్మీర్‌లో ఏమి జరుగుతుందో దానిని ఆపాలని అన్నారు. ‘‘భారతదేశం చాలా సోదర దేశం. మేము ఎల్లప్పుడూ సోదర సంబంధాలను పంచుకుంటాం. ఇది ప్రత్యేకమైనది. మేము భారతదేశంతో మూడు యుద్ధాలు చేశాం. ఆ యుద్ధాలతో పాకిస్తాన్ గుణపాఠం నేర్చుకుంది. యుద్దాల పర్యవసానంగా మరింత కష్టాలు, నిరుద్యోగం, పేదరికం మాత్రమే ఉన్నాయి. మనం సమస్యలను పరిష్కరించుకోగలిగితే భారత్‌తో శాంతియుతంగా జీవించాలనుకుంటున్నాం’’ అని షెహబాజ్‌ షరీఫ్ చెప్పారు.  

“శాంతియుతంగా జీవించడం, పురోగతి సాధించడమా లేదా ఒకరితో ఒకరు గొడవపడి సమయం, వనరులను వృధా చేసుకోవడమా అనేది మన ఇష్టం. మేము పేదరికాన్ని నిర్మూలించాలని, అభివృద్దిని సాధించాలని, మా ప్రజలకు  విద్య, ఆరోగ్య సౌకర్యాలు, ఉపాధిని అందించాలని కోరుకుంటున్నాం. బాంబులు,  మందుగుండు సామగ్రి కోసం మా వనరులను వృధా చేయకూడదని అనుకుంటున్నానని.. అదే నేను ప్రధాని మోడీకి ఇవ్వాలనుకుంటున్న సందేశం’’ అని షెహబాజ్‌ షరీఫ్ అన్నారు. 

రెండు దేశాలను ఏకతాటిపైకి తీసుకురావాలని తాను యుఏఈ అధ్యక్షుడిని  కోరుతున్నట్టుగా కూడా చెప్పారు. “భారత ప్రధాని నరేంద్ర మోడీకి నా సందేశం ఏమిటంటే.. మనం కూర్చుని, మాట్లాడుదాం, మన సమస్యలన్నింటినీ టేబుల్‌పైకి తెచ్చుకుందాం. కశ్మీర్‌తో సహా పలు అంశాలకు పరిష్కారాన్ని కనుగొందాం’’ అని షెహబాజ్‌ షరీఫ్ అన్నారు. 

భారతదేశంలో మైనారిటీలు పీడించబడుతున్నారని పాకిస్తాన్ ఆరోపణలను షెహబాజ్ ఇప్పటికీ పునరావృతం చేశారు. కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘పాకిస్థాన్ శాంతిని కోరుకుంటుంది. అయితే కాశ్మీర్‌లో జరుగుతున్న వాటిని ఆపాలి’’ అని అన్నారు. ‘‘రెండు దేశాలలో ఇంజనీర్లు, వైద్యులు, నైపుణ్యం కలిగిన కార్మికులు ఉన్నారు. మేము ఈ ఆస్తులను శ్రేయస్సు కోసం ఉపయోగించాలనుకుంటున్నాము. రెండు దేశాలు అభివృద్ధి చెందడానికి ఈ ప్రాంతంలో శాంతిని తీసుకురావాలనుకుంటున్నాం’’ అని  చెప్పుకొచ్చారు. 

అయితే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ పాకిస్తాన్ ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలపై భారత్ ఏ విధంగా స్పందిస్తుందో వేచిచూడాల్సి ఉంది. ఉగ్రవాద హింస నీడలో పాకిస్థాన్‌తో ఎలాంటి చర్చలు జరగవని భారత్‌ ఇదివరకే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే