8 మంది భారత నేవీ మాజీ అధికారులకు ఖతర్‌లో మరణ శిక్ష.. దిగ్భ్రాంతికరం: కేంద్రం

భారత నేవీ మాజీ అధికారులకు ఖతర్‌లో మరణ శిక్ష పడింది. గూఢచర్య ఆరోపణల కింద గతేడాది ఆగస్టులో ఎనిమిది మంది భారతీయులను ఖతర్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా కోర్టు తీర్పులో వీరికి మరణ శిక్ష విధించింది.

Google News Follow Us

న్యూఢిల్లీ: ఖతర్ జైలులో మగ్గుతున్న భారత నేవీ మాజీ అధికారులకు మరణ శిక్ష విధిస్తూ తాజాగా కోర్టు తీర్పు ఇచ్చింది. గూఢచర్యం కేసులో వీరికి ఈ శిక్ష విధించింది. గూఢచర్యం కేసులోనే వారిని ఖతర్ అధికారులు గతేడాది ఆగస్టులో అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అయితే, వీరిపై మోపిన అభియోగాలను ఖతర్ అధికారులు బహిర్గతం చేయలేదు.

ఈ వార్త తెలిసిన వెంటనే భారత ప్రభుత్వం దిగ్భ్రాంతికి గురైంది. ఈ కేసుకు తాము అధిక ప్రాధాన్యత ఇస్తామని, అన్ని రకాల న్యాయపరమైన అవకాశాలను పరిశీలిస్తామని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. ఎనిమిది మంది భారత నేవీ మాజీ అధికారులు, భారతీయులు, అల్ దహ్రాలో పని చేస్తున్న వీరందరికీ మరణ శిక్ష విధిస్తూ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ ఆఫ్ ఖతర్ తీర్పు వెలువరించిందని తమకు తెలిసిందని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది.

ఈ తీర్పుతో తాము దిగ్భ్రాంతి చెందినట్టు వివరించింది. వారి కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉన్నామని, న్యాయ బృందంతో అన్ని రకాల అవకాశాలను అన్వేషిస్తామని తెలిపింది. అన్ని దౌత్యపరమైన, న్యాయపరమైన సహకారాలను కొనసాగిస్తామని పేర్కొంది. ఈ తీర్పును ఖతర్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లుతామని వివరించింది. ఈ కేసు రహస్య స్వభావం రీత్యా మరింత సమాచారాన్ని వెల్లడించలేమని తెలిపింది.

Also Read: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి: మునుగోడులో తీన్మార్.. ముగ్గురు నేతల మధ్య టికెట్ పోరు

దౌత్యపరమైన యాక్సెస్ అందిన తర్వాత ఖతర్‌కు భారత అంబాసిడర్ అయిన అధికారి శిక్ష పడిన ఈ భారతీయులను అక్టోబర్ 1వ తేదీన కలిశారు.