ఉక్రెయిన్‌లోని స్కూల్‌పై బాంబులు.. 60 మంది దుర్మరణం!.. రష్యా అనుకూల రీజియన్‌లో ఘటన

Published : May 08, 2022, 06:27 PM IST
ఉక్రెయిన్‌లోని స్కూల్‌పై బాంబులు.. 60 మంది దుర్మరణం!.. రష్యా అనుకూల రీజియన్‌లో ఘటన

సారాంశం

ఉక్రెయిన్‌లోని తూర్పు భాగంలో ఓ స్కూల్‌పై రష్యా బలగాలు బాంబులు వేశాయి. ఆ స్కూల్‌లో సుమారు 90 మంది తలదాచుకున్నారని తెలిసింది. ఇందులో 30 మందిని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగామని, కానీ, సుమారు 60 మంది ఆ శిథిలాల కిందే మరణించి ఉంటారని ఆ రీజియన్ గవర్నర్ తెలిపారు.  

న్యూఢిల్లీ: తూర్పు ఉక్రెయిన్‌లోని లుగాన్స్క్ రీజియన్‌లో బాంబులు కురిశాయి. లుగాన్స్క్ రీజియన్‌లో ఓ గ్రామంలోని స్కూల్‌పై బాంబులు కురిసినట్టు ఆ రీజియన్ గవర్నర్ వెల్లడించారు. అయితే, ఈ స్కూల్‌లో  90 మంది తలదాచుకుంటున్నట్టు తెలిపారు. బాంబుల దాడి కారణంగా ఈ బిల్డింగ్ మొత్తం ధ్వంసమైపోయింది. చుట్టూర మంటలు అంటుకున్నాయి. మంటలను అదుపులోకి తేవడానికి సుమారు నాలుగు గంటల కాలం పట్టింది. అయితే, ఈ కాలంలో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ముప్పై మందిని ఈ భవన శిథిలాల కింది నుంచి కాపాడినట్టు గవర్నర్ సెర్హియ్ గైదై తెలిపారు. అందులో ఏడుగురికి తీవ్రంగా గాయాలైనట్టు వివరించారు. కాగా, రెండు మృతదేహాలను రికవరీ చేసుకున్నట్టు చెప్పారు. సుమారు 60 మంది ఈ శిథిలాల కిందే ప్రాణాలు వదిలి ఉంటారని పేర్కొన్నారు.

తూర్పు ఉక్రెయిన్‌లోని లుగాన్స్క్, దొనెత్స్క్‌లు దొన్‌బాస్ రీజియన్‌లోనే ఉంటాయి. ఉక్రెయిన్ చరిత్రలో దొన్‌బాస్ అనేక ఘర్షణలు ఎదుర్కొంది. దొన్‌బాస్ రీజియన్‌లోని పై రెండు ప్రాంతాల్లో రష్యా అనుకూల తిరుగుబాటుదారులు లేదా ఉక్రెయిన్‌లోని వేర్పాటువాదులు ఉన్నారు. ఉక్రెయిన్‌పై దాడికి ముందు ఈ రెండు ప్రాంతాలను రష్యా స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తించింది. అంటే లుగాన్స్క్ రష్యా అనుకూల ప్రాంతం. కానీ, ఈ ప్రాంతంలో రష్యా దాడుల నుంచి తప్పించుకోవడానికి ఉక్రెయిన్ పౌరులు ఆ స్కూల్‌లో తలదాచుకున్నట్టు తెలుస్తున్నది. కానీ, ఈ స్కూల్‌పై రష్యానే బాంబులు వేయడం కలకలం రేపింది.

ఇదిలా ఉండగా, ఉక్రెయిన్ నైరుతి భాగం, కీలకమైన పోర్టు నగరం మరియుపోల్‌ను రష్యా ఇటీవలే ఆక్రమించుకుంది. ఈ క్రమంలో మరియుపోల్‌ను రష్యా నాశనం చేసింది. అజవ్‌స్తల్‌ స్టీల్ వర్క్స్ ప్లాంట్‌లో ఉక్రెయిన్ పౌరులు, బలగాలు చివరగా తలదాచుకున్నాయి. ఈ ప్లాంట్ నుంచి వారు తిరిగి సురక్షిత ఉక్రెయిన్ భూభాగంలోకి వెళ్లడానికి సుమారు వారం రోజులపాటు అంతర్జాతీయంగా సంప్రదింపులు జరిగాయి.

ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ప్రకటించింది. అయితే, దాన్ని యుద్ధం అని కాకుండా సైనిక చర్య అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నాడు. తమ లక్ష్యం ఉక్రెయిన్‌లో అదనంగా, అవసరానికి మించి ఉన్న మిలిటరీ సామర్థ్యం, మిలిటరీ స్థావరాలేనని ప్రకటించాడు. అందుకే తమ లక్ష్యంగా మిలిటరీ స్థావరాలే ఉంటాయని, ఆ దేశ పౌరులకు తాము హాని తలపెట్టబోమని చెప్పాడు. కానీ, ఆ తర్వాత మొదలైన యుద్ధంలో అనేక సందర్భాల్లో ఉక్రెయిన్ పౌరుల మరణాలు చోటుచేసుకోవడం గమనార్హం.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bangladesh Unrest: బంగ్లాదేశ్‌లో ఏం జ‌రుగుతోంది.? అస‌లు ఎవ‌రీ దీపు.? భార‌త్‌పై ప్ర‌భావం ఏంటి
Alcohol: ప్ర‌పంచంలో ఆల్క‌హాల్ ఎక్కువగా తాగే దేశం ఏదో తెలుసా.? భారత్ స్థానం ఏంటంటే