
న్యూఢిల్లీ: ఏలియెన్స్ గురించిన టాపిక్ ఎప్పుడూ ఇంట్రెస్టింగ్‌గానే ఉంటుంది. చిన్నప్పుడు పేదరాశి పెద్దమ్మ కథల్లాగే.. ఏలియెన్స్ చుట్టూ అల్లుకున్న కథలు అన్నీ వినడానికి చాలా ఆసక్తిగా ఉంటాయి. అయితే, ఇది ఏలియెన్స్ గురించిన విషయం కాదు. కానీ, ఆ ఏలియెన్స్ (గ్రహాంతరవాసులు) ప్రయాణిస్తున్న లేదా వాటి వాహనంగా భావిస్తున్న ఓ గుర్తు తెలియని ఎగిరే ఆబ్జెక్ట్ గురించిన వార్త. వాటినే అన్‌ఐడెంటిఫైడ్ ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్ (యూఎఫ్‌వో)గా పిలుచుకుంటుంటారు. ఈ యూఎఫ్‌వో గురించిన వదంతులు ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఎందుకుంటే అందుకు సంబంధించి నిర్దిష్టమైన ఫొటోలు చాలా తక్కువ. కానీ, తాము చూశామన్న వాదనలే ఎక్కువ. అయితే, ఇందుకు భిన్నంగా 50 ఏళ్ల క్రితం తీసిన ఓ ఫొటో ఇప్పటి వరకు యూఎఫ్‌వోల చిత్రాల్లో ఎక్కువ క్లారిటీతో ఉన్నదని పేర్కొంటున్నారు. ఆ బెస్ట్ యూఎఫ్‌వో ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఆ ఫొటోను చాలా మీడియా సంస్థలు ప్రచురించాయి. ఇప్పటి వరకు యూఎఫ్‌వోలను అత్యంత క్లారిటీగా తీసిన ఫొటో ఇదేనని యూజర్లు పేర్కొంటున్నారు. ఈ ఫొటోను సెర్జియో లొయాజా 1971 సెప్టెంబర్‌లో తీశాడు. కోస్టారికా తీరంలో ఓ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కోసం సర్వే చేస్తూ ఓ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఎగురుతూ ర్యాండమ్‌గా తీసిన ఫొటోల్లో ఇదీ ఒకటి.
కింద ఉన్న సరస్సుకు పది వేల అడుగుల ఎత్తు నుంచి హై రిజల్యూషన్ ఫొటోలు అనేకం తీశాడు. అందులో ఓ ఫొటోలో ఈ గుర్తు తెలియని వస్తువు కనిపించింది. ఈ ఫొటోను ఎన్‌హాన్స్ చేయగానే ఆ గుర్తు తెలియని వస్తువు మరింత స్పష్టంగా కనిపించింది.
అయితే, ఆ ఫొటో నేషనల్ జియోగ్రాఫిక్ కొస్టారికాకు ప్రాపర్టీ. ఆ సర్వే చేపట్టాలని ఆదేశించినది ఇదే. ఆ ఫొటోను ఇప్పుడు ఓ వ్యక్తి సంపాదించి సోషల్ మీడియాలో వదిలాడు.
ఈ ఫొటోలోని గుర్తు తెలియని వస్తువు గురించి కొన్నేళ్లుగా నిపుణులు చర్చిస్తున్నారు. కొస్టారికా యూఎఫ్‌వో రీసెర్చర్ రికార్డో విల్చెజ్, డాక్టర్ రిచర్డ్ హైనెస్, డాక్టర్ జాక్వస్ వాలీలు ఈ ఫొటోను పలుమార్లు విశ్లేషించారు. ఆ ఫొటోలో కనిపిస్తున్న వస్తువు నిజంగా ఆ సమయంలో అక్కడ ఎగురుతూ ఉన్నదేనని పేర్కొన్నారు. అంతకు మించి వారు మరేమీ చెప్పలేకపోయారు. ఫొటోలో కనిపిస్తున్న ఆ ఆబ్జెక్ట్ వ్యాసం 120 నుంచి 220 అడుగుల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.