నేపాల్‌లో విమానం క్రాష్.. 44 మంది మృతి.. ఫ్లైట్‌లో ఐదుగురు భారతీయులు

By Mahesh KFirst Published Jan 15, 2023, 3:08 PM IST
Highlights

నేపాల్‌లో ఈ రోజు ఉదయం జరిగిన విమాన ప్రమాదంలో 44 మంది మరణించినట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రమాద సమయంలో విమానంలో 72 మంది ఉన్నారు. ఇందులో విదేశీయులు 15 మంది.. అందులో భారతీయులు ఐదుగురు ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు.
 

న్యూఢిల్లీ: నేపాల్‌లో ఈ రోజు ఉదయం విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 44 మంది మరణించారు. ప్రమాద సమయంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది విమానంలో ఉన్నారు. ఇందులో 15 మంది విదేశీయులు ఉండగా.. అందులో ఐదుగురు భారతీయులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ రోజు ఉదయం కాట్మాండు నుంచి బయల్దేరిన విమానం టూరిస్టుల తాకిడి ఎక్కువగా ఉండే పొఖారా ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతుండగా యెతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన ట్విన్ ఇంజిన్ ఏటీఆర్ 72 విమానం క్రాష్ అయింది.

విదేశీ ప్రయాణికుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారని యెతి ఎయిర్‌లైన్స్ ప్రతినిధి సుదర్శన్ బర్తౌలా వివరించారు. ఐదుగురు భారతీయులు, నలుగురు రష్యన్లు, ఒక ఐరిష్ పౌరుడు, ఇద్దరు కొరియన్లు, ఒక అర్జెంటినియన్ పౌరుడు, మరో ఫ్రెంచ్ దేశస్తుడు ఉన్నారని వివరించారు. 

కాట్మాండ్ నుంచి బయల్దేరిన 20 నిమిషాల తర్వాత విమానం కూలిపోయింది. కాట్మాండ్ నుంచి పొఖారాకు విమాన ప్రయాణం 25 నిమిషాల వ్యవధి. కాట్మాండ్‌లోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఉదయం 10.33 గంటలకు విమానం టేకాఫ్ అయింది. సేతీ నదీ లోయలో విమానం కూలిపోయింది. ఈ ప్రమాదం నుంచి బతికి బట్టకట్టిన వారి గురించిన వివరాలు ఇంకా స్పష్టంగా తెలియవని సుదర్శన్ బర్తౌలా తెలిపారు. 

Also Read: నేపాల్‌లో కుప్పకూలిన విమానం.. ప్రమాద సమయంలో విమానంలో 72 మంది.. 16 మృతదేహాలు వెలికితీత..

కాగా, భారత పౌర విమాన యాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ ఘటనపై రెస్పాండ్ అయ్యారు. మృతులకు సంతాపం తెలిపారు. వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. నేపాల్ ఫ్లైట్ క్రాష్ బాధాకరం అని పేర్కొన్నారు.

click me!