
భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో చేస్తున్న అభివృద్ది, ఆయన పనితీరు, దౌత్య నీతిపై బయటి దేశాలకు చెందినవారు కూడా ప్రశంసలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ విశ్లేషకులు షాజాద్ చౌదరి కూడా ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. భారతదేశాన్ని బ్రాండ్‌గా మార్చేందుకు నరేంద్ర మోదీ తన ముందు ఉన్న నాయకులు ఎవరూ చేయలేని పని చేశారని అన్నారు. ప్రధాని మోదీ భారతదేశాన్ని విస్తృతంగా ప్రభావం చూపే స్థాయికి తీసుకువచ్చారని పేర్కొన్నారు. అయితే దాయాది పాకిస్తాన్ నుంచి భారత్‌పై ప్రశంసలు రావడం చాలా అరుదనే చెప్పాలి.
‘‘నరేంద్ర మోదీ పాకిస్థాన్‌లో అసహ్యించుకునే పేరు కావచ్చు.. కానీ భారతదేశాన్ని బ్రాండ్ చేయడానికి మోదీ చేస్తున్న పనిని ఆయన ముందు ఎవరూ నిర్వహించలేకపోయారు’’ అని షాజాద్ చౌదరి పేర్కొన్నారు. ఈ మేరకు పాకిస్తాన్‌లో ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ కోసం వార్తపత్రికలో రాసిన కాలమ్‌లో షాజాద్ చౌదరి అభిప్రాయాన్ని వెల్లడించారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ఎంతగానో అభివృద్ధి చెందిందని ప్రశంసించారు.
ప్రత్యర్థులుగా ఉన్న ప్రపంచంలోని రెండు అగ్రరాజ్యాలు యుఎస్, రష్యాలు భారతదేశాన్ని తమ మిత్రదేశంగా పేర్కొంటున్నాయని షాజాద్ చౌదరి అన్నారు. ‘‘ఇది దౌత్యపరమైన శౌర్యం కాకపోతే.. మరేమిటి?..’’ అని ప్రశ్నించారు. భారతదేశం ప్రపంచ స్థాయిని వివరిస్తూ.. ఉక్రెయిన్‌పై సైనిక చర్య కోసం రష్యాపై అమెరికా ఆంక్షలు విధించినప్పటికీ.. ఆ దేశంతో స్వేచ్ఛగా వ్యాపారం చేయగల ఏకైక దేశంగా భారత్ ఉందని ఉదహరించారు.
భారతదేశం పరిమాణంలోనే కాకుండా.. ప్రపంచంలో తన పాదముద్ర విస్తరిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను, మూడో అతిపెద్ద మిలిటరీని కలిగి ఉన్నా భారతదేశం తన సామర్థ్యాన్ని పెంచుకునే మార్గంలో ఉందని అన్నారు. పాకిస్తాన్ తన సోదర సోదరుడిగా భావించే సౌదీ అరేబియాను తమ దేశంలో 7 బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టమని అడుగుతున్న సమయంలో.. సౌదీ అరేబియా భారతదేశంలో 72 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టనున్నట్టుగా ప్రకటించడాన్ని షాజాద్ చౌదరి తన కాలమ్‌లో వివరించారు.
మోదీ పరిపాలనను అతకుముందు పాలకులతో పోల్చుతూ.. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో 252 బిలియన్ డాలర్లతో పోలిస్తే ప్రధాని మోదీ హయాంలో భారతదేశ విదేశీ నిల్వలు 600 బిలియన్ డాలర్లకు పెరిగాయని ఆయన ప్రస్తావించారు. ఆయన ప్రకారం.. భారతదేశం జీడీపీ పరిమాణం మూడు ట్రిలియన్ డాలర్లకు పైగా ఉంది.. ఇది పెట్టుబడిదారులకు ఇష్టపడే గమ్యస్థానంగా మార్చిన స్మారక పురోగతికి నిదర్శనం.
జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేసిన సమయంలో కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌ను భారతదేశం రాజకీయంగా ఎలా అధిగమించిందో గుర్తుచేస్తూ.. భారతదేశానికి అనుకూలంగా జనాభాలో క్రమంగా మ్యుటేషన్ నిరంతరాయంగా కొనసాగుతోందని అన్నారు. ఇస్లామాబాద్ భారతదేశం పట్ల దాని విధానాన్ని పునఃపరిశీలించాలని, విస్తృత ఆర్థిక వృద్ధికి ఉత్ప్రేరకంగా ఉండటానికి ఆసియాపై దృష్టి సారించి చైనాతో పాటు త్రి-దేశాల ఏకాభిప్రాయాన్ని రూపొందించాలని పిలుపునిచ్చారు. ఈ పని పూర్తి చేయకపోతే పాకిస్తాన్ చరిత్రలో కిందకు కుదించబడుతుందని ఆయన తన విశ్లేషణలో పేర్కొన్నారు.