Bulgaria: రోడ్డు ప్రమాదం.. బస్సులో మంటలు.. 45 మంది సజీవ దహనం

By telugu teamFirst Published Nov 23, 2021, 12:49 PM IST
Highlights

బల్గేరియా దేశంలో వరుస ప్రమాదాలు జరిగాయి. ఓ బీభత్స ఘటనలో టర్కీ నుంచి బయల్దేరిన బస్సు బల్గేరియా రాజధాని సోఫియా సమీపంలో తీవ్ర ప్రమాదానికి గురైంది. అనంతరం బస్సులో మంటలు చెలరేగాయి. ఈ మంటలకు కనీసం 45 మంది ఆహుతయ్యారు. మరో ఘటనలో ఓ హోం కేర్‌లో మంటలు వ్యాపించడంతో కనీసం 9 మంది ప్రాణాలు కోల్పోయారు.
 

న్యూఢిల్లీ: ఐరోపా దేశం Bulgariaలో ఘోర ప్రమాదాలు(Accident) జరిగాయి. రెండు ఘటనల్లోనూ మంటలు ప్రాణాలు తీశాయి. ఒక చోట రోడ్డు ప్రమాదం జరిగి Busలో మంటలు అంటుకున్నాయి. ఇందులో 45 మంది సజీవ దహనమయ్యారు. ఇందులో మృతుల్లో చిన్నారులూ ఉన్నట్టు తెలిసింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. కాగా, మరో ఘటనలో ఓ Nursing Homeలో మంటలు వ్యాపించాయి. ఈ మంటలకూ తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మంటలు వ్యాపించే సమయంలో ఇందులో మొత్తం 58 మంది వృద్ధులు ఉన్నారు. తొమ్మిది మంది మరణించారు.

Turkey దేశం ఇస్తాంబుల్ నుంచి ఉత్తర మాసిడోనియాలోని స్కోప్జే నగరానికి ఆ బస్సు బయల్దేరింది. కాగా, బల్గేరియా దేశంలోకి ఎంటర్ అయిన తర్వాత రాజధాని సోఫియాకు సమీపంలో(సోఫియాకు సుమారు 40 కిలోమీటర్ల దూరంలో) దుర్ఘటన జరిగింది. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ఘోర ప్రమాదానికి గురైంది. హైవేపై భద్రత కోసం నిర్మించే గార్డ్‌రెయిల్‌ను ఈ బస్సు ఢీకొట్టి ఉంటుందని కొందరు అనుమానిస్తున్నారు. ఈ యాక్సిడెంట్ తర్వాత బస్ససులో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో నలభై ఐదు నుంచి నలభై ఆరు మంది చనిపోయారని దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన అధికారి నికోలాయ్ నికోలోవ్ తెలిపారు. కాగా, ఏడుగురు ప్రయాణికులను కాపాడగలిగామని వివరించారు.

Also Read: అమెరికాలో క్రిస్మస్ పరేడ్ పైకి దూసుకెళ్లిన కారు, పలువురు మృతి, 20మందికి పైగా గాయాలు...

స్థానిక చానెల్ బీటీవీ ప్రకారం, ఈ బస్సులో 12 మంది చిన్నారులూ ప్రయాణిస్తున్నారని తెలిసింది. ఆ దేశ స్థానిక కాలమానం ప్రకారం, రాత్రి 2 గంటల ప్రాంతంలో బొస్నేక్ గ్రామం వద్ద ప్రమాదం జరిగింది. మృతుల్లో చిన్నారులూ ఉన్నారని అధికారి నికోలోవ్ వివరించారు. ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, దీనిపై దర్యాప్తు మొదలు పెట్టినట్టు తెలిపారు. కాగా, మృతుల్లో ఎక్కువ మంది మాసిడోనియా వాసులే అయి ఉంటారని అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఆ బస్సుకు ఉత్తర మాసిడోనియాకు చెందిన నంబర్ ప్లేట్ ఉన్నది.

ఈ ఘటన దేశ ప్రభుత్వన్ని పరుగులు పెట్టించింది. ఉత్తర మాసిడోనియా ప్రధాన మంత్రి జొరాన్ జేవ్ ఘటనా స్థలికి రాబోతున్నట్టు ఓ మీడియా సంస్థ తెలిపింది. కాగా, ఇప్పటికే బల్గేరియా అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి బొయ్‌కో రాష్కోవ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల మృతదేహాలు పూర్తిగా కాలి పోయాయని తెలిపారు.కాగా, ఉత్తర మాసిడోనియా ప్రధాన మంత్రి జొరాన్ ఇప్పటికే బల్గేరియా ప్రధానమంత్రితో మాట్లాడినట్టు తెలిసింది.

Also Read: జైలులో గ్యాంగ్ వార్.. 68 మంది మృతి.. డ్రగ్స్ రవాణాపై ఆధిపత్యం కోసం ఘర్షణలు!

మరో ఘటనలో 9 మంది వయోధికులు మంటలకు ప్రాణాలు కోల్పోయారు. రొయక్ అనే గ్రామంలో పాత పాఠశాల భవనాన్ని కేర్ హోమ్‌గా మార్చారు. ఈ కేర్ హోమ్‌లోనే నిన్న సాయంత్రం 6 గంటలకు (1600జీఎంటీ) మంటలు వ్యాపించాయి. స్థానికులు వెంటనే  అధికారులకు సమాచారం అందించారు. వెంటనే కనీసం ఆరు ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలు అదుపులోకి తెచ్చాయి. కానీ, దురదృష్టవశాత్తు ఈ ఘటనలో తొమ్మిది మంది చనిపోయారని, ఫైర్ డిపార్ట్‌మెంట్ చీఫ్ తిహొమిర్ తొతేవ్ వివరించారు. ఈ బిల్డింగ్‌లో మంటలు వ్యాపించినప్పుడు మొత్తం 58 మంది ఉన్నారని తెలిపారు.

ఆ నర్సింగ్ హోం నుంచి మిగతా వృద్ధులకు మెడికల్ కేర్ తీసుకుంటున్నట్టు వివరించారు. ఈ మంటల సమయంలో చాలా మంది పొగను పీల్చుకుని శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారిందని తెలిపారు. కాగా, ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

click me!