
ఈజిప్టులో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈజిప్ట్ రాజధాని కైరోలోని ఇంబాబా ప్రాంతంలోని అబూ సెఫీన్ చర్చి జరిగిన అగ్ని ప్రమాదంలో 41 మంది మృతిచెందినట్టుగా చర్చి అధికారులను ఉటంకిస్తూ ఏఎఫ్‌పీ న్యూస్ ఏజెన్సీ రిపోర్టు చేసింది. ఈ ప్రమాదంలో 14 మంది గాయపడ్డారు. అయితే మంటలు చెలరేగడానికి గల కారణాలు వెంటనే తెలియరాలేదు. అయితే ప్రాథమిక విచారణలో విద్యుత్ షార్ట్‌సర్క్యూటే మంటలు చెలరేగడానికి కారణమని పోలీసులు తెలిపారు. ఆదివారం ఉదయం సభ జరుగుతుండగా మంటలు చెలరేగాయని పేర్కొన్నారు.
చర్చిలో మంటలు చెలరేగిన సమాచారం తెలుసుకున్న అగ్నిమాప సిబ్బంది.. వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేపట్టింది. ప్రస్తుతం చర్చిలో మంటలు అదుపులోకి వచ్చినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.
ఇక, ఈ ఘటనపై ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫట్టా ఎల్-సిస్సీ.. కాప్టిక్ క్రిస్టియన్ పోప్ తవాద్రోస్ IIతో ఫోన్‌లో మాట్లాడి తన సంతాపాన్ని తెలియజేశారని అధ్యక్ష కార్యాలయం తెలిపింది. ఇక, ప్రధానంగా ముస్లిం జనాభా ఉండే ఈజిప్ట్‌లో.. 10 శాతం కాప్టిక్ క్రిస్టియన్స్ ఉన్నారు.