అమెరికాలో కాల్పులు కలకలం.. ఇంట్లో పార్టీ జరుగుతుండగా బుల్లెట్ల వర్షం.. నలుగురు మృతి..

By Sumanth KanukulaFirst Published Jan 24, 2022, 10:40 AM IST
Highlights

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. ఆదివారం తెల్లవారుజామున లాస్ ఏంజెల్స్ (Los Angeles) సమీపంలో ఓ ఇంట్లో జరుగుతున్న పార్టీపై దుండగులు కాల్పులు జరిపారు. పార్టీలో పాల్గొన్నవారిని టార్గెట్‌గా చేసుకుని బుల్లెట్ల వర్షం కురిపించారు. 

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. ఆదివారం తెల్లవారుజామున లాస్ ఏంజెల్స్ (Los Angeles) సమీపంలో ఓ ఇంట్లో జరుగుతున్న పార్టీపై దుండగులు కాల్పులు జరిపారు. పార్టీలో పాల్గొన్నవారిని టార్గెట్‌గా చేసుకుని బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ ఘటనలో నలుగురు మరణించారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. ఇంగ్లీవుడ్ (Inglewood) నగరంలోని ఒక ఇంటిపై కాల్పులు జరిగాయని వచ్చిన వార్తలపై పోలీసులు తెల్లవారుజామున స్పందించారని మేయర్ జేమ్స్ బట్స్ (James Butts) మీడియాకు తెలిపారు. మరణించినవారిలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నట్టుగా అక్కడి మీడియా సంస్థలు వెల్లడించాయి. మరోకరు ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడని పేర్కొన్నాయి. 

కాల్పుల జరిపిన వ్యక్తుల చేతిలో తుపాకీతో సహా పలు ఆయుధాలతో ఉన్నట్టుగా బట్స్ చెప్పారు. చాలా ఏళ్ల తర్వాత ఇంగ్లీవుడ్‌లో జరిగిన అత్యంత దారుణమైన హింసాత్మక చర్యగా పేర్కొన్నారు. దీనిని ఆకస్మిక దాడిగా అభిప్రాయపడ్డారు. ఈ నేరానికి పాల్పడిన నిందితులను వదిలిపెట్టేది లేదని.. వారిని గుర్తించి న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన నిందితుల కోసం పోలీసులు అన్వేషణ కొనసాగిస్తున్నారు. కాల్పులు జరిగిన ఇంటికి సమీపంలో ఏర్పాటు చేసిన భద్రతా కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా సాక్ష్యులను కూడా విచారిస్తున్నారు. 

బాధితులను లక్ష్యంగా చేసుకుని నిందితులు కాల్పులు జరిపినట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. అయితే కాల్పులకు గల కారణం తమకు తెలియదని, అనుమానితుల కోసం వెతుకుతున్నామని అధికారులు తెలిపారు.
 

click me!