
Nigeria: నైజీరియాలోని ఓ చర్చిలో విషాద ఘటన జరిగింది. దక్షిణ నైజీరియాలోని పోర్ట్ హార్కోర్ట్ పట్టణంలోని ఓ చర్చిలో స్థానిక పోలో క్లబ్ లో డొనేషన్ డ్రైవ్ నిర్వహించింది. ఇందులో భోజనంతో పాటు మంచి మంచి బహుమతులు అందిస్తామని నిర్వాహకులు ప్రచారం చేశారు. దీంతో పెద్ద ఎత్తున జనం పోటెత్తారు. తిండి కోసం, గిప్టుల కోసం ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 31 మంది దుర్మరణం చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది చిన్నారులే ఉండటం బాధకరం..
వివరాల్లోకెళ్తే.. దక్షిణ నైజీరియాలోని పోర్ట్ హార్కోర్ట్ పట్టణంలోని ఓ చర్చిలో స్థానిక పోలో క్లబ్ ఆధ్వర్యంలో 'షాప్ ఫర్ ఫ్రీ' అనే స్వచ్ఛంద సంస్థ డొనేషన్ డ్రైవ్ నిర్వహించింది. ఈ కార్యక్రమం కోసం భారీగా ప్రచారం చేశారు. ఇందులో ఆహారంతో పాటు ఇతర వస్తువులను అందిస్తామని నిర్వాహకులు ప్రచారం చేశారు దీంతో జనాలు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటలకు కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉండగా.. జనం ఉదయం 5 గంటల నుంచే భారీ సంఖ్యలో గుమిగుడారు. నిర్వహకుల అంచనా కంటే భారీగా ప్రజలు అక్కడికి వచ్చారు. దీంతో పంపిణి కష్టంగా మారింది. అదే సమయంలో క్యూలో నిల్చున్న జనాలు అసహనానికి లోనయ్యారు. దీంతో కార్యక్రమంలో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఇందులో 31 మంది స్పాట్ లోనే మృతి చెందగా, మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం హాస్పిటల్ తరలించారు. ఘటనపై సమాచారం రాగానే అక్కడికి వెళ్లిన పోలీసులు.. పరిస్థితిని కంట్రోల్ చేశారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు ఉన్నారని అధికారులు తెలిపారు.
నైజీరియా సివిల్ డిఫెన్స్ కార్ప్స్ ప్రాంతీయ ప్రతినిధి ఒలుఫెమి అయోడెల్ మీడియాతో మాట్లాడుతూ.. ,
శనివారం తెల్లవారుజామునే వందలాది మంది చర్చి ముందు బారులు తీరారని, వీరి అదుపు చేయడానికి చర్చి గేట్లు ముసివేశారని, అయినా చర్చి గేటును బద్దలు గొట్టుకుని లోనికి వచ్చారని తెలిపారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగిందని, తొక్కిసలాట జరిగే సమయానికి ఇంకా బహుమతుల పంపిణి ప్రారంభం కాలేదని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్థు చేస్తున్నారు. సరైన వసతులు లేకుండా డొనేషన్ డ్రైవ్ నిర్వహించిన నిర్వాహకులపైనా కేసు నమోదు చేశారు.
ఈ దేశంలో చమురు నిల్వలు ఉన్నప్పటికీ.. ఈ దేశంలో 80 మిలియన్లకు పైగా ప్రజలు పేదరికంలో జీవిస్తున్నారు. ఇటీవలి ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం, 10 మంది నైజీరియన్లలో నలుగురు జాతీయ పేదరిక స్థాయికి దిగువన నివసిస్తున్నారు. ఇటువంటి సంఘటనలు నిత్యం జరుగుతూనే ఉంటాయి.