అమెరికాలో మళ్లీ తుపాకుల మోత.. క్రిస్టియన్ స్కూల్‌లో కాల్పులు.. ముగ్గురు చిన్నారులతో సహా ఆరుగురు మృతి..

By Rajesh KarampooriFirst Published Mar 28, 2023, 12:05 AM IST
Highlights

అమెరికాలో మరోసారి తుపాకీల మోత మోగింది. నాష్‌విల్లే నగరంలో జరిగిన కాల్పుల్లో విద్యార్థులతో సహా ఆరుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అమెరికాలో మరోసారి తుపాకీల మోత మోగింది. నాష్‌విల్లే నగరంలోని  ఓ ప్రైవేట్ క్రిస్టియన్ స్కూల్‌లో సోమవారం ఉదయం జరిగిన కాల్పుల్లో ముగ్గురు విద్యార్థులతో సహా 6 మంది చనిపోయారు. దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అక్కడికక్కడే కాల్చిచంపారు. బుల్లెట్ గాయాల కారణంగా ముగ్గురు చిన్నారులతో సహా మరికొందరు మరణించారు. ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు నిర్ధారించారు. దాడికి గురైన పాఠశాల పేరును కాన్వెంట్ స్కూల్ అని చెబుతున్నారు. ఘటన జరిగిన నాటి నుంచి ఆ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు.

వాస్తవానికి కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన బాధితులను వెంటనే చికిత్స కోసం మన్రో కారెల్ జూనియర్ పిల్లల ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు వారు చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ దాడిలో ఇంకా ఎవరైనా ప్రాణనష్టం జరిగిందా లేదా అనేది ధృవీకరించబడలేదు. ఈ ఘటన తర్వాత పాఠశాలలో ఉన్న ఇతర విద్యార్థులను పోలీసు రక్షణలో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భయభ్రాంతులకు గురైన విద్యార్థులను వారి తల్లిదండ్రులతో కలిసి చర్చికి తీసుకువస్తున్నారు. పాఠశాల వెబ్‌సైట్ ప్రకారం, 2001లో స్థాపించబడిన పాఠశాలలో దాదాపు 200 మంది విద్యార్థులు ఉన్నారు. అలాగే పాఠశాలలో 33 మంది ఉపాధ్యాయులు ఉన్నారు

గురుద్వారాలో కాల్పులు 

ఆదివారం అర్థరాత్రి (స్థానిక కాలమానం ప్రకారం) కాలిఫోర్నియాలోని శాక్రమెంటో కౌంటీలో గురుద్వారాలో కాల్పులు జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఇక్కడ ముగ్గురు వ్యక్తుల మధ్య కాల్పులు జరిగాయి, ఇందులో ఇద్దరు వ్యక్తులు కాల్చబడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. ముగ్గురు పరిచయస్తుల మధ్య కాల్పులు జరిగినట్లు కౌంటీ షెరీఫ్ కార్యాలయం తెలిపింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

అసలేం జరిగిందంటే..? 

ఈ ఘటనపై శాక్రమెంటో కౌంటీ షెరీఫ్ అధికార ప్రతినిధి అమర్ గాంధీ మాట్లాడుతూ.. కాల్పులు జరిపిన ముగ్గురు వ్యక్తులు ఒకరికొకరు తెలిసిన వారే కాబట్టి కాల్పులు ద్వేషపూరిత నేరానికి సంబంధించినవి కాదన్నారు. ఇంతకుముందు ఏదో విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవని చెప్పారు. ఒక అనుమానితుడు తన తుపాకీని తీసి, ఇతర వ్యక్తిపై కాల్చాడు. దీని తర్వాత.. కాల్పులు జరపని వ్యక్తి, తుపాకీని తీసి మొదటి షూటర్‌పై కాల్పులు జరిపి అక్కడి నుండి పారిపోయాడు.

గతంలోనూ ఇలాంటి ఘటనలు ..

ఇంతకు ముందు కూడా అమెరికాలో ఇలాంటి దాడులు జరగడం గమనార్హం.జనవరిలో అమెరికాలోని అయోవాలోని ఓ పాఠశాలలో విచక్షణా రహితంగా కాల్పులు జరిపిన ఘటన జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా, ఉపాధ్యాయుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు రెండు రోజుల ముందు కాలిఫోర్నియాలో జరిగిన విచక్షణారహిత కాల్పుల్లో 10 మంది చనిపోయారు. దీంతో పాటు పలువురికి గాయాలయ్యాయి.

click me!