
పాకిస్తాన్ : కుక్కలకు మరణశిక్ష విధించడం ఎప్పుడైనా విన్నారా? తాజాగా పాకిస్తాన్ లో ఈ విచిత్రమే చోటు చేసుకుంది. మనుషులకు మరణ శిక్ష విధిస్తారన్నది తెలిసిన విషయమే కానీ.. విచిత్రంగా రెండు కుక్కలకు మరణ శిక్ష విధించారు.
వినడానికి కాస్త ఆశ్చర్యంగానే ఉన్నా నిజంగానే పాకిస్తాన్లో రెండు కుక్కలకు మరణశిక్ష విధించారు. కరాచీలోని ఓ న్యాయవాదిపై దాడి చేశాయన్న కారణంగా రెండు జర్మన్ షెపర్డ్ కుక్ లకు మరణశిక్ష విధించడం గమనార్హం. మీర్జా అక్తర్ అనే సీనియర్ లాయర్ గత నెలలో మార్నింగ్ వాక్ కోసం వెళ్లారు. అక్కడ ఓ రెండు కుక్కలు అతనిపై దాడి చేశాయి.
ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఈ దృశ్యాలన్నీ అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ తర్వాత ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అంతటి క్రూరమైన కుక్కలను ఇళ్ల మధ్య ఉంచినందుకు యజమానిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు.
ఇక అక్తర్ లాయర్ కావడంతో అతను కోర్టుకు వెళ్లాడు. అయితే చివరికి కుక్కల యజమానికి హుమాయున్ ఖాన్ రాజీకి వచ్చాడు. కానీ రాజీకి అంగీకరిస్తూనే లాయర్ అక్తర్ యజమానికి పలు షరతులు పెట్టాడు.
ఇంతటి దారుణం జరిగినందుకు తనకు వెంటనే క్షమాపణలు చెప్పాలని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదకరమైన కుక్కలను ఇంట్లో పెంచుకోవద్దని, అలాగే తనపై దాడి చేసిన ఆ కుక్కలను వెంటనే ఓ వెటర్నరీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి విషపూరిత ఇంజక్షన్లతో చంపేయాలని షరతులు విధించారు. ఈ ఒప్పందంపై ఇద్దరూ సంతకాలు చేసి కోర్టులో సమర్పించారు. అయితే ఈ ఒప్పందం పై హక్కుల కార్యకర్తలు తీవ్రంగా మండిపడుతున్నారు.